వినువీధిలో మనువాడినవేళ...! | Sky Diving Marriage | Sakshi
Sakshi News home page

వినువీధిలో మనువాడినవేళ...!

Sep 13 2014 2:33 AM | Updated on Sep 2 2017 1:16 PM

వినువీధిలో మనువాడినవేళ...!

వినువీధిలో మనువాడినవేళ...!

జర్మనీలోని ఫ్రీబర్గ్ ప్రాంతం.. ఉదయం 10 గంటల సమయం.. జెస్సీ చిడ్ (32), ఇంగో మౌల్లర్ (46)లు మరికొన్ని క్షణాల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

జర్మనీలోని ఫ్రీబర్గ్ ప్రాంతం.. ఉదయం 10 గంటల సమయం.. జెస్సీ చిడ్ (32), ఇంగో మౌల్లర్ (46)లు మరికొన్ని క్షణాల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అక్కడి విమానాశ్రయంలో వారి కోసం ఓ ప్రైవేటు విమానం సన్నద్ధంగా ఉంది. వధూవరులిద్దరితోపాటు పాస్టర్, మరికొందరు ఎక్కగానే విమానం టేకాఫ్ అయింది. 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లాక పాస్టర్ సమక్షంలో జెస్సీ, ఇంగోలు ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం ఇద్దరూ విమానంలో నుంచి కిందకు దూకారు. పాస్టర్ కూడా వారిని అనుసరించారు. అలా గాలిలో తేలియాడుతూ వధూవరులిద్దరూ ముద్దు పెట్టుకోవడంతో వారి వివాహ తతంగం పరిపూర్ణమైంది. జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి అనే ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుని.. వారు ఇంతటి సాహసానికి పూనుకున్నారు. అందరిలా కాకుండా కాస్త వెరైటీగా గగనపు వీధిలో వినూత్నంగా ఒక్కటవ్వాలని ప్లాన్ వేసుకున్నారు.

ఇంగోకు స్కైడైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉంది. దీంతో అతడు మామూలుగానే కిందకు దూకాడు. కానీ జెస్సీ, పాస్టర్లకు ఇవన్నీ కొత్త. అందుకే వారిద్దర్నీ ఇద్దరు శిక్షకులు తమకు కట్టుకుని కిందకు దూకారు. అలా గాలిలో అంతా ఒక్కచోట చేరిన తర్వాత జెస్సీ, ఇంగోలు ముద్దుపెట్టుకున్నారు. తర్వాత పారాచూట్ల సహాయంతో కిందకు దిగారు. ఇలా వినువీధిలో వివాహం చేసుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందని జెస్సీ పేర్కొంది. తాము కోరుకున్న విధంగా ఇలా పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ఏడాదిపైనే పట్టిందని వివరించింది. ‘‘అన్నింటికన్నా ముఖ్యంగా మాతోపాటు కిందకు దూకే ధైర్యమున్న పాస్టర్‌ను పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. ఎంతమందిని అడిగినా ఎవరూ అందుకు ముందుకు రాలేదు. అలాగే కొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది’’ అని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement