కసరత్తులు అక్కర్లేదు.. ఒక్క ట్యాబ్లెట్‌ చాలు! | Sakshi
Sakshi News home page

కసరత్తులు అక్కర్లేదు.. ఒక్క ట్యాబ్లెట్‌ చాలు!

Published Mon, Aug 28 2017 2:19 AM

కసరత్తులు అక్కర్లేదు.. ఒక్క ట్యాబ్లెట్‌ చాలు!

లండన్‌: అప్పుడప్పుడూ టీవీల్లో యాడ్స్‌ వస్తుంటాయి.. కష్టపడుతూ గంటల తరబడి జిమ్‌లో కండలు కరిగించాల్సిన అవసరం లేదని, ఈ చిన్నపాటి బెల్టును పెట్టుకుంటే చాలు నాజూగ్గా మారిపోతారంటూ చెబుతారు. అందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదుగానీ.. శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అలాంటి మాటలే చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తే శరీరం ఎటువంటి ప్రభావానికి లోనవుతుందో సరిగ్గా అలాంటి మార్పులే శరీరంలో సంభవించేలా చేసే ఓ మాత్రను తయారు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. వ్యాయామం చేసిన ఫలితాలు పొందుతారంటున్నారు.

యూకేలోని లీడ్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మాత్రలను తయారు చేశారట. ‘పీజో1’గా నామకరణం చేసిన ఈ మాత్ర వేసుకోగానే.. వ్యాయామం చేయడం ద్వారా కలిగే ఫలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘కసరత్తులు చేసే సమయంలో శరీరంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. తద్వారా శరీరంలోని కీలక అవయవాలకు మరింత రక్తప్రసరణ జరుగుతుంది. ఇటువంటి మార్పులే తాము తయారు చేసిన పీజో1 మాత్ర వేసుకున్నప్పుడు కూడా కలుగుతాయి’ అని పరిశోధకుల్లో ఒకరైన డేవిడ్‌ బీచ్‌ తెలిపారు.  

Advertisement
Advertisement