అంతరించిపోతున్న సొర చేపలు | Sakshi
Sakshi News home page

అంతరించిపోతున్న సొర చేపలు

Published Thu, Dec 13 2018 7:29 PM

Shark Fishing Endangered In Arabian Sea - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొర చేపలు (షార్క్స్‌) నశించిపోతున్నాయి. ప్రధానంగా వేట వల్లనే ఈ పరిస్థితి వస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. సొర చేపలను వేటాడంలో ప్రపంచంలోనే ఇండోనేసియా మొదటి స్థానంలో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. సొర చేపల్లోని ప్రతి అవయంతోని ఉపయోగం ఉండడమే అందుకు కారణం. సొర చేప చర్మాన్ని పాద రక్షలు, బ్యాగుల తయారీకి ఉపయోగించడం, దాని లివర్‌ నుంచి వచ్చే నూనెకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడం, దానిలోని మదులాస్థిని ఔషధాల్లో ఉపయోగించడం లాంటి ఉపయోగాలెన్నో.

మానవులకన్నా, వక్షాలకన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, అంటే దాదాపు 35 కోట్ల క్రితం నుంచి జీవిస్తున్న సొర చేపల్లో 153 రకాల సొర చేపలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 50 శాతం రకాలు అంతరించిపోయినట్లు డాక్టర్‌ రిమా జమాడో తెలియజేశారు. ఆయనతోపాటు పలు దేశాలకు చెందిన 24 మంది బయోలాజిస్టులు 2017లో ఆరేబియా సముద్రంతోపాటు పక్కనే  ఉన్న ఎర్ర సముద్రం, ఓమన్‌ సముద్రంతోపాటు 20 దేశాలకు ఆనుకున్న సముద్రాల్లో వారు సొర చేపల మనుగడపై అధ్యయనం చేశారు. వారిలో భారత్‌కు చెందిన బయోలాజిస్టు కూడా ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషరీస్‌ కారణంగానే సొర చేపలకు ముప్పు వస్తోందని బయోలాజిస్టుల అధ్యయనంలో తేలింది. వాణిజ్యపరంగా డిమాండ్‌ ఉన్న ఇతర చేపల లక్ష్యంగా ఫిషరీస్‌ విభాగాలు వేటాడుతుంటే సొరచేపలు ఎక్కువ పడుతున్నాయి, వాటిని మళ్లీ నీటిలోకి వదలకుండా వాటి అవయవాలకు కూడా డిమాండ్‌ ఉండడంతో అవి ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. అన్ని సొర చేపల లివర్‌ ఆయిల్‌కు డిమాండ్‌ ఉండదు. వెయ్యి అడుగుల లోతుల్లో తిరుగాడే సొర చేపల లివర్‌ ఆయిల్‌కే డిమాండ్‌ ఉంటుంది. వాటిలోనే ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకం. ఇంతకుముందు మాల్దీవుల్లో, ఇప్పుడు జపాన్‌ ఈ లివర్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement