‘నా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి’

Scotland Girl Letter Found By New Owner 11 Years Later Leaving The Home - Sakshi

బాల్యం తాలూకు మధుర స్మృతులు ఎవరి జీవితంలోనైనా అత్యంత విలువైనవి. ఇక పుట్టి పెరిగిన ఇంటిపై ఉండే మమకారం సరేసరి. పరిస్థితుల ప్రభావంగా ఇల్లు మారినా సరే అక్కడి పరిసరాలతో ముడిపడిన అనుబంధం మాత్రం చెక్కుచెదరదు. అలాంటి సమయంలో ఇంటిని వీడి పోయేటపుడు కలిగే బాధ వర్ణనాతీతం. స్కాట్లాండ్‌కు చెందిన చార్లెట్‌కు పదమూడేళ్ల వయసు ఉన్నపుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో తన మనసులో కలిగిన భావాలను ఓ లెటర్లో పొందుపరిచి తన గదిలో ఓ చోట దాచిపెట్టింది.

‘నా జీవితంలో 11 ఏళ్ల కాలం ఈ ఇంట్లోనే గడిచిపోయింది. ఇది నా చిన్ననాటి బెడ్‌రూం. ఇంకో రెండు రోజుల్లో ఈ గదిని, ఇంటిని విడిచివెళ్తున్నాం. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నా కోసం.. నా ఇంటిని జాగ్రత్తగా చూసుకోరూ’  అంటూ చార్లెట్‌ రాసిన ఆ ఉత్తరం దాదాపు 11 ఏళ్ల తర్వాత వాళ్ల ఇంటి కొత్త ఓనర్‌ మార్టిన​ జాన్‌స్టోన్‌కు దొరికింది.

ఇంటిని రెనోవేషన్‌ చేయిస్తున్న సమయంలో తనకు దొరికిన లెటర్‌ను చూసి ఆశ్చర్యానికి గురైన మార్టిన్‌..‘ మా ఇంటి ఎక్స్‌ట్రా బెడ్‌రూంలోని కార్పెట్‌ కింద ఈ లెటర్‌ దొరికింది. ప్రస్తుతం చార్లెట్‌ ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా’ అంటూ లెటర్‌ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. మార్టిన్‌ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో కేవలం 18 గంటల్లోనే చార్లెట్‌ జాడ తెలిసిపోయింది. ‘ నిజంగా ఇది నాకు సర్‌ప్రైజ్‌. తొమ్మిదేళ్లుగా నేను బాత్‌లో జీవిస్తున్నా. గ్లాస్గోలోని మా పాత ఇంటితో ఉన్న అనుబంధాన్ని మీ ట్వీట్‌ మరోసారి గుర్తుచేసింది. నేను ఆశించినట్లుగానే మీరు ‘నా ఇంటి’ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా. థ్యాంక్యూ మార్టిన్‌’ అంటూ చార్లెట్‌ ట్విటర్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top