ఒంటి కాలిపై ఎందుకు నిల్చుంటాయంటే...

Scientists Find The Reason For Flamingos Stand On Leg - Sakshi

ఫ్లెమింగోలు... ఆకాశంలో అరుదైన విన్యాసాలతో ఆ‍కట్టుకునే అందమైన పక్షులు. శీతాకాలం ప్రారంభం కాగానే వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ మన దేశానికి వలస వచ్చే ఈ రాజహంసలను చూడటానికి పర్యాటకులు ముచ్చటపడుతూ ఉంటారు. అయితే వేల కిలో మీటర్ల పొడవునా ఒకే మార్గాన్ని అనుసరించడంలో, సుదీర్ఘంగా ఎగరడంలో, వేగంగా నీళ్లలో నడవడంలోనూ వాటికవే సాటి. ఇలాంటి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్న ఫ్లెమింగోలు గంటల తరబడి ఒంటి కాలిపైనే నిలబడతాయి. శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకునేందుకే ఫ్లెమింగోలు ఇలా నిల్చుని ఉంటాయని గతంలో చాలా మంది చాలా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే తాజాగా... చనిపోయిన ఫ్లెమింగోల శరీరాలపై వరుస ప్రయెగాలు చేసిన యంగ్‌ హుయ్‌ చాంగ్‌ అనే  ప్రొఫెసర్‌ అసలు కారణం ఇదేనంటూ రాయల్‌ సొసైటీ బయాలజీ లెటర్స్‌లో పలు ఆసక్తికర అంశాలను ప్రచురించారు.

అసలు కారణం ఇదే..
‘నిలబడి ఉన్నపుడు తక్కువ కండర బలాన్ని ఉపయోగించడం ద్వారా ఫ్లెమింగోలు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుకోగలవు. అందుకే ఒంటి కాలిపై నిలబడేందుకే అవి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే రెండు కాళ్లపై నిల్చునే కంటే ఒంటి కాలిపై నిల్చోడమే వాటికి తేలికైన పని. అందుకోసం తక్కువ టార్క్‌ బలం అవసరమవుతుంది కాబట్టి.. అలాంటి భంగిమలో ఉన్నపుడు అవి పక్కకు ఒరిగే అవకాశం ఉండదు. తద్వారా ఒంటి కాలిపై నిల్చునే గంటల తరబడి నిద్ర పోగలవు కూడా’ అంటూ తాజా అధ్యయనంలో యంగ్‌ హుయ్‌ అనేక విషయాలు పొందుపరిచారు. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. పరిశోధనల్లో భాగంగా చనిపోయిన ఫ్లెమింగోలను రెండు కాళ్లపై నిలబెట్టడం అసలు సాధ్యపడలేదు గానీ, ఒంటి కాలిపై చాలా సులభంగా నిలబెట్టామని యంగ్‌ హుయ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top