సౌదీపై దాడుల్లో ఇరాన్‌ హస్తం!

Saudi Arabia Says Iran Involvement In Oil Attacks - Sakshi

చమురుక్షేత్రాల్లో డ్రోన్‌ దాడులపై ప్రాథమిక ఆధారాలున్నాయి

సౌదీఅరేబియా ప్రకటన

రియాద్‌ : సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడులకు పాల్పడింది ఇరానేనని దానికి తగ్గ ప్రాథమిక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. ఈ దాడులపై విచారణ సమయంలో దొరికిన శిథిలాలను పరిశీలించి చూస్తే ఇరాన్‌ ప్రాంతం నుంచే దాడులు జరిగినట్టు అర్థం అవుతోందని సౌదీ నేతృత్వంలో సంకీర్ణ సర్కార్‌ అధికార ప్రతినిధి టర్కీ అల్‌ మాలికి రియాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులు తాము చేసిన పనేనని, అత్యంత ఆధునికమైన ఇంజన్లు కలిగిన డ్రోన్లను వినియోగించి యెమన్‌ నుంచి దాడులకు పాల్పడినట్టు ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. హౌతీ తిరుగుబాటుదారులకి ఇరాన్‌ మద్దతు ఉంది. అయితే సౌదీ ప్రభుత్వం దానికి పూర్తి విరుద్ధంగా యెమన్‌ నుంచి ఈ దాడులు జరిగినట్టు తమ విచారణలో తేలలేదని చెబుతున్నారు. ఈ డ్రోన్ల ప్రయోగం కచ్చితంగా ఎక్కడ నుంచి జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అల్‌ మాలికి వెల్లడించారు. దాడి జరిగిన ప్రాంతంలో లభించిన ఛిన్నాభిన్నమైన డ్రోన్, క్షిపణి శిథిలాలను అమెరికా, సౌదీ అరేబియాకు చెందిన నిపుణులు అణువణువు పరీక్షించి చూస్తున్నారు.  

ఇరాన్‌పైనే అమెరికా అనుమానాలు  
ఈ దాడులు జరిగిన దగ్గర్నుంచి అగ్రరాజ్యం అమెరికా ఇది ఇరాన్‌ చేసిన పనేనని ఆరోపిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ దీనికి సంబంధించి ట్వీట్లు కూడా చేశారు. దోషులు ఎవరో తమకు తెలుసునని, సౌదీ అరేబియా స్పందన కోసమే తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే ఇరాన్‌పై యుద్ధానికి దిగే ఉద్దేశం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. గల్ఫ్‌లో తమ మిత్రదేశాల ప్రయోజనాల కోసం, అక్కడ ఉన్న అమెరికా దళాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్‌ చెప్పారు. 

దక్షిణ ఇరాన్‌ నుంచే దాడులు ? 
ఇరాన్‌లో దక్షిణ ప్రాంతం నుంచి డ్రోన్ల ప్రయోగం జరిగినట్టు అమెరికా ప్రభుత్వంలో సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. యెమన్‌ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొంటున్న సౌదీ రక్షణ శాఖ ఇరాన్‌ నుంచి వచ్చిన ముప్పును గమనించలేకపోయిందని వెల్లడించారు. మరోవైపు ఈ ఆరోపణల్ని ఇరాన్‌ తోసిపుచ్చింది. ‘ నిరాధారమైన, ఆమోదయోగ్యం కాని ఆరోపణలు చేయడం అమెరికాకే చెల్లింది’ ఇరాన్‌ తెలిపింది. ఇరాన్‌కు కీలకమద్దతుదారు అయిన రష్యా నిజానిజాలు బయటపడే వరకు ఈ దాడులపై తుది నిర్ణయానికి ఎవరూ రావద్దంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top