ఈ ఫాంట్‌తో మతిమరుపుకు చెక్‌!

Sans Forgetica is a font that aids memory - Sakshi

మార్కెట్‌కు వెళ్లి మీరనుకున్న కొన్ని వస్తువులు  కొనడం మర్చిపోయారా? పరీక్షకు చదవాల్సిన ముఖ్యమైన పాఠాలు చదవడం మరిచిపోయారా? ఇలాంటి మతిమరుపులు మనల్ని నిత్యం ఇబ్బందికి గురి చేస్తూంటాయి కదా! అయితే ఇకపై ఆ ఆందోళన అవసరం లేదు. మనం చెయ్యాల్సిన పనులు పక్కాగా గుర్తించుకునేలా ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త ఫాంట్‌ను సృష్టించారు. ‘శాన్స్‌ ఫర్‌గెటికా’అనే ఈ ఫాంట్‌లో నోట్స్‌ రాసుకుంటే మనం చెయ్యాల్సిన పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమట!  

జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుంది ?
మనం రోజూ పలు రకాల ఫాంట్‌లు వినియోగిస్తూంటాం. అందులో చూడడానికి అందంగా, కళ్లకి ఆహ్లాదంగా ఉండే ఫాంట్స్‌నే ఎంచుకుంటాం. అయితే మనం వాడే భాష, అవతలివాళ్లు ఏదైనా మాట్లాడితే మనం పెట్టే శ్రద్ధ, జ్ఞాపకశక్తి, అవగాహన, సృజనాత్మకత, ఆలోచన వంటి మానసిక సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని శాన్స్‌ ఫర్‌గెటికా ఫాంట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఫాంట్‌లో ఏది రాసుకున్నా అంత తేలిగ్గా మర్చిపోకపోవడమే దీని ప్రత్యేకత! ఇతర ఫాంట్‌లతో పోల్చి చూసినా శాన్స్‌ ఫర్‌గెటికా ఫాంట్‌లో రాసింది చదవడం చాలా కష్టం. అలా కష్టపడి, కూడబలుక్కొని చదవడం వల్ల ఎవరూ తొందరగా మర్చిపోరు.

ఇది నిర్ధారించడానికి 400 మంది వర్సిటీ విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఇంగ్లిష్‌లో సాధారణంగా వాడే ఏరియల్‌ ఫాంట్‌లో రాసుకున్న విషయాలను 50 శాతం మంది గుర్తు పెట్టుకుంటే, అదే విషయాన్ని శాన్స్‌ ఫర్‌గెటికా ఫాంట్‌లో రాస్తే 57 శాతం మంది గుర్తుంచుకున్నారు. ఈ కొత్త ఫాంట్‌ను ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టి డిజైన్‌ చేశారు. మొదటిది అక్షరాలు కాస్త వెనక్కి వంపు తిరిగి ఉండటం అంటే మ్యాప్‌లో నదుల్ని గుర్తించడానికి వాడే డిజైన్‌ లాంటిదన్నమాట.

ఇక రెండోది అక్షరానికి అక్షరానికి మధ్య ఉండే దూరం. ఈ ఫాంట్‌లో ఉంటే ప్రత్యేకమైన వంపు, దూరం కారణంగా చదవడం కష్టమే అయినా.. అది మెదడులో నిక్షిప్తం చేసుకోవడం సులభమవుతుందని ఈ ఫాంట్‌ డిజైనింగ్‌కు నేతృత్వం వహించిన స్టీఫెన్‌ బన్హమ్‌ పేర్కొన్నారు. మన కంప్యూటర్లలోనూ ఈ ఫాంట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని జ్ఞాపకశక్తిని ఎలా పెంచుతుందో మీరూ పరీక్షించండి!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top