థాయిలాండ్‌లో మరో ‘హౌడీ మోదీ’

The Prime Minister of India Will Participate in Sawasdee PM Modi in Bangkok - Sakshi

బ్యాంకాక్‌ : అమెరికాలోని ఎన్నారైలో గత సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఎన్నారైలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హ్యూస్టన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి దాదాపు 50 వేల మంది ఎన్నారైలు హాజరవగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇలాంటి కార్యక్రమాన్నే థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో నిర్వహించనున్నారు. 

థాయ్‌లాండ్‌లోని ఎన్నారైలో ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు ‘సవస్దీ పీఎం మోదీ’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత ఎంబసీ పర్యవేక్షించే ఈ కార్యక్రమం ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. సవస్దీ అంటే థాయ్‌ భాషలో శుభాకాంక్షలు చెప్పడం లేదా వీడ్కోలు చెప్పడం. ఈ సవస్దీ అనే పదం సంస్కృతంలోని ‘స్వస్థి’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు.

స్వస్థి అంటే శ్రేయస్సు అని అర్థం. ఈ సందర్భంగా సిక్కుల మత గురువు గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం నాణేన్ని విడుదల చేస్తారు. మరోవైపు థాయ్‌ భాషలో అనువదించిన ప్రసిద్ధ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను ఆవిష్కరిస్తారు. ఆదివారం థాయ్‌ ప్రధాని ప్రయూత్‌ చాన్‌ ఒ చా తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇదిలాఉండగా.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం ఉదయం థాయ్‌లాండ్‌ బయల్దేరి వెళ్లారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top