
ప్లాస్టిక్ బాటిళ్లతో ఇళ్లు!
ప్లాస్టిక్‌తో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని తెలుసు. ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.
కెనడా: ప్లాస్టిక్‌తో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని తెలుసు. ఈ ప్లాస్టిక్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ప్లాస్టిక్‌ను వదిలించుకునేందుకు కెనడాకు చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ బీజూ ఓ వినూత్న ప్రయత్నం చేపట్టాడు. పనామాలోని ఓ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ చెత్త ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లతో ఏకంగా ఓ గ్రామాన్నే కట్టేయాలని సంకల్పించాడు. ప్లాస్టిక్‌తో వచ్చే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని బీజూ చెబుతున్నాడు.
ప్లాస్టిక్ బాటిల్ విలేజి పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 83 ఎకరాల్లో 90 నుంచి 120 ఇళ్లు నిర్మించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఇనుప చట్రం లోపల ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచి గోడలు, ఇతర నిర్మాణాలు చేపడతారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 10 వేల నుంచి 25 వేల బాటిళ్లు అవసరమవుతాయని అంచనా. అతి చౌకగా, చాలా వేగంగా కట్టగలిగే ఈ ఇళ్లలో బయటి వేడి లోపలికి రాదని చెబుతున్నాడు. గ్రామంలో ఓ హోటల్, సూపర్‌మార్కెట్ వంటి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసిన తరువాత ఇళ్లను అమ్మకానికి పెడతానని బీజూ పేర్కొంటున్నాడు. ఒక్కో ఇల్లుకు రూ.1.5 లక్షల డాలర్ల నుంచి మూడు లక్షల డాలర్లు అవుతుందని అంచనా.