
కుక్క నా పాస్ పోర్ట్ తినేసింది.. ఇప్పుడెలా!
పెంపుడు కుక్క తన పాస్ పోర్టు తినేసిందంటూ అంతర్జాతీయ ఆటగాడు లబోదిబో మంటున్నాడు.
మాడ్రిడ్: పెంపుడు కుక్క తన పాస్ పోర్టు తినేసిందంటూ అంతర్జాతీయ ఆటగాడు లబోదిబో మంటున్నాడు. గేమ్ నిమిత్తం బ్రిటన్ వెళ్లాల్సి ఉన్న క్రమంలో ఇలా జరడడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్పెయిన్ కు చెందిన మాథ్యూ షెపర్డ్ రగ్బీ ప్లేయర్. అతడి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలున్నాయి. ఏడేళ్ల వయసున్న హనీ అనే ఆడకుక్క, ఏడు నెలల వయసున్న బ్రూట్స్ అనే మగకుక్క (కాకర్ స్పానియెల్ రకపు పెట్స్) ను పెంచుకుంటున్నారు.
బ్రిటన్ కు వెళ్లడానికి తాను సిద్ధమయ్యానని, అయితే పాస్ పోర్ట్ వ్యాలిడిటీ లాంటి వివరాలు చెక్ చేసి తన రూములో ఉంచానని ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ చెప్పాడు. 'పనిమీద బయటకు వెళ్లిన నేను ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో ఏవో చిన్న చిన్న కాగితం ముక్కలు కనిపించాయి. ఆ సమయంలో నా బెడ్రూమ్ లో బ్రూట్ కనిపించింది. దాని నోట్లోనూ పేపర్లు ఉండటం గమనించి చెక్ చేశాను. ఇంకేముంది.. నా పాస్ పోర్టును బ్రూట్ నామరూపాలు లేకుండా చేసి, తినేసింది.
పాస్ పోర్టు ఆఫీసుకు వెంటనే పరుగులు తీశాను. వారికి జరిగిన విషయం చెప్పాను. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కనుక సాధ్యమైనంత త్వరంగా కొత్త పాస్ పోర్టు తయారు చేసి ఇస్తామన్నారు. నా పెట్ బ్రూట్స్ తప్పేంలేదు. ఎన్ని వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలి అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇన్ని తెలిసినా బ్రూట్స్ కు అందుబాటులో నా పాస్ పోర్టు పెట్టడం నాదే తప్పు. ఇకనుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తానని' బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రగ్బీ ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ వివరించాడు.