ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి!

ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి! - Sakshi


మహిళ కనిపిస్తే చాలు మగాళ్ళు.. మృగాళ్ళై పోతున్నారు. రాను రాను మానవత్వం నశించి, రాక్షసులుగా మారుతున్నారు. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం తన,పర, లింగ, వయో బేధాలను సైతం మర్చిపోతున్నారు. కనిపించిన వారిని కాటేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి మానవ మృగాల దారుణాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన దారుణం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళపై దుండగులు ఒడిగట్టిన కిరాతక చర్య.. మానవ సమాజం తలదించుకునేలా చేసింది.



తొడపై తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆమె.. పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ. మాన్ సెహరా పట్టణం వాయువ్యప్రాంతంలోని ఆమె నివాసానికి చేరిన ముగ్గురు సాయుధ దుండగులు తలుపు బద్దలుకొట్టిమరీ ఆమెపై దాడికి దిగారు. తుపాకీతో కాల్చి, ఆమెపై ఆఘాయిత్యానికి ప్రయత్నించారు.  లైంగిక చర్యలకు తమకు సహకరించలేదన్న కోపంతో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తీవ్రంగా ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసు అధికారి అమ్మర్ నియాజ్ తెలిపారు. దుండగులను నిర్బంధించేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.  బాధితురాలు గాయం నుంచి కోలుకొంటోందని, ఆస్పత్రినుంచి ఆమెను డిశ్చాడ్చి చేసినట్లు పోలీసులు తెలపడంతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనతో పాకిస్తాన్ మాన్ సెహరా ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లక్ష్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయంటూ  ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు, హిజ్రా కమ్యూనిటీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళన చేపట్టారు. అధికారులు నేరస్థులను పట్టుకొని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.



నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లోకంటే ట్రాన్స్ జెండర్లు పాకిస్తాన్ లో తమ హక్కులను వినియోగించుకుంటుండగా, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, విషయంలో మాత్రం పక్షపాత ధోరణి కనిపిస్తుంది. వాటిలో అట్టడుగున ఉండటంతోపాటు అనేక వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటికీ పాకిస్తాన్ తోపాటు, భారత్, బాంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పలువురు హిజ్రాలు దాడులు, మానభంగాలకు గురవ్వడమేకాక, వేశ్యలుగా కూడ పనిచేస్తున్నారు. కొందరు పొట్టపోసుకొనేందుకు ట్రాఫిక్ లైట్లవద్ద, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఒక్క  ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలోనే తమ కమ్యూనిటీ సభ్యులపై కనీసం ఐదు దాడులు జరిగినట్లు ట్రాన్స్ జెండర్ సంఘాలు చెప్తున్నాయి. మే నెలలో పెషావర్ ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె స్నేహితుడు పలుమార్లు దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పైగా ఆమెను మేల్, ఫిమేల్ వార్డుల్లో ఏ వార్డులో చేర్చాలో తెలియక ఆలస్యం చేయడంతోనే ఆమె చనిపోయినట్లు స్నేహితులు చెప్పడం ఆందోళన రేకెత్తించింది. తమకు ఐడీ కార్డులు జారీచేయాలంటే లింగ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి అంటున్నారని, అందుకు తాము అంగీకరించకపోతే  కార్డులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పాకిస్తాన్  ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్మాస్ బాబీ తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి, తమనుసైతం మనుషులుగా గుర్తించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top