పాక్‌ దూకుడు.. అర్ధరాత్రి రహస్యంగా...

Pakistan Test Fires Ghaznavi Ballistic Missile - Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూ కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్‌ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి రహస్యంగా యుద్ధ క్షిపణిని పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల స్వల్పశ్రేణి యుద్ధ క్షిపణి ‘ఘజ్నవి’ని పాకిస్థాన్‌ ప్రయోగించింది. గురువారం తెల్లవారుజామున బలూచిస్తాన్‌లోని సోన్‌మియాని టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు పాకిస్తాన్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రయోగానికి సంబంధించిన 30 సెకన్ల వీడియోను షేర్‌ చేశారు. నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌(ఎన్‌డీసీ) తయారు చేసిన ఘజ్నవి క్షిపణి 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆయన తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, జాతికి ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అభినందనలు తెలిపారు.

కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్‌ కొద్దిరోజులుగా మాటల యుద్ధానికి దిగింది. భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం రాబోతోందని పాక్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ బుధవారం రావల్పిండిలో వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై ఎంతవరకైనా వెళ్తామని, అణు యుద్ధానికి వెనుకాడబోమని అంతకుముందు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్షిపణిని ప్రయోగించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: భారత్‌పై పాక్‌ నిషేధం; గందరగోళం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top