
కరాచీ(పాకిస్తాన్): బలూచిస్తాన్‌లో జరిగిన బాంబు పేలుడులో కీలక ప్రతిపక్షనేతతోపాటు అతని సోదరుడు మృత్యువాతపడ్డారు. అవామీ నేషనల్ పార్టీ(ఏఎన్‌పీ) నేత అబ్దుల్ రజాక్, అతని సోదరుడు అబ్దుల్ ఖలిక్ శనివారం ఉదయం పిషిన్ పట్టణంలో జరగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకు తమ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో నసీరాబాద్ జిల్లా ఛత్తర్ ప్రాంతంలోని హర్నాయి షహ్‌రాగ్ మార్గంలో మందుపాతర పేలి వారి వాహనం తునాతునకలయింది. ఈ ఘటనలో అబ్దుల్ రజాక్, అబ్దుల్ ఖలిక్ అక్కడికక్కడే చనిపోయారు.
పార్లమెంట్‌లో ఏఎన్‌పీకి 8మంది సభ్యులున్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. ఇదే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారు. మరో ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై అమర్చిన బాంబు పేలటంతో లాహోర్ వైపు వెళ్తున్న అక్బర్ బుగ్తి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.