ఎన్నికల తర్వాతే భారత్‌తో చర్చలన్న పాక్‌

Pak Says No Talks With India Before Loksabha Polls - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత్‌తో శాంతి చర్చల పునరుద్ధరణ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరమే ఉంటుందని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి స్పష్టం చేశారు. భారత్‌లో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా చర్చల పునరుద్ధరణకు అవకాశం లేదన్నారు. ఇస్లామాబాద్‌లో గురువారం పాక్‌ విదేశీ వ్యవహారాల సెనేట్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

స్టాండింగ్‌ కమిటీ భేటీలో భారత్‌తో ద్వైపాక్షిక చర్చల అంశాన్ని ప్రస్తావించామన్నారు. పొరుగు దేశాలైన భారత్‌, ఆప్ఘనిస్తాన్‌లతో పాక్‌ సంబంధాలతో పాటు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవలి సౌదీ అరేబియా, చైనా పర్యటనలపై కూడా పాక్‌ స్టాండింగ్‌ కమిటీలో చర్చలు జరిపినట్టు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది. కాగా పాక్‌ వ్యతిరేక ప్రచారంతో భారత్‌లో ఓట్ల వేట సాగుతుందని, పాక్‌తో సంబంధాలు భారత్‌లో ఎన్నికల అంశం అవుతుందని ఇటీవల ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్న క్రమంలో స్టాండింగ్‌ కమిటీ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం భారత్‌కు తాను మరోసారి స్నేహహస్తం అందిస్తానని ఇమ్రాన్‌ ఖాన్‌ గతంలో చెప్పుకొచ్చారు. రియాద్‌లో ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ ఫోరమ్‌ వద్ద మీడియా ప్రతనిధులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top