మౌత్‌ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం

Mouth spray can deactivate coronavirus by  in 20 minutes - Sakshi

స్వీడన్‌కు చెందిన ఎంజైమాటికా కీలక ప్రకటన

‘కోల్డ్‌జైమ్’ తో 20 నిమిషాల్లో 98.3 శాతం వైరస్‌ చస్తుంది

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. మరోవైపు ఈ మహమ్మారిని నిలువరించేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి  తీసుకొచ్చేలా దిగ్గజ ఫార్మా సంస్థలు తీవ్ర ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి.  ఈ నేపథ్యంలో స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. తమ మౌత్‌ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని ప్రకటించింది. మహమ్మారికి కారణమైన సార్స్‌-కోవ్‌2  వైరస్‌ను క్రియారహితం చేస్తుందని తమ  ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. (9 కోట్ల ‌మోతాదుల వ్యాక్సిన్‌ కొనుగోలు)

ఎంజైమాటికాకు చెందిన మౌత్‌ స్ప్రే ‘కోల్డ్‌జైమ్’ కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను 98.3 శాతం నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. అలాగే నోటి ద్వారా వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా ఇది నిరోధిస్తుందని ప్రకటించింది.  తాజా అధ్యయనంలో కోవిడ్‌-19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నామని పేర్కొంది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన ధృవీకరించబడిన ల్యాబ్‌ అని ఎంజైమాటికా వివరించింది. 

కోల్డ్‌జైమ్ ఎలా పని చేస్తుంది?
ప్రధానంగా గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన సొల్యూషన్‌తో నిండిన కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ పరీక్ష జరిగిందని కంపెనీ వెల్లడించింది. కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి  స్ప్రే చేస్తే ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ పరీక్షలకు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడైందని ఎంజైమాటికా  సీఈఓ  క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్  ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top