
లండన్ : సాధారణంగానే హాలీడేస్ వస్తే అక్కడికి తీసుకెళ్లు, ఇక్కడికి తీసుకెళ్లు అంటూ పిల్లలు మారాం చేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా రోజంతా ఇంట్లోనే ఉంటూ బోర్ కూడా కొడుతూ ఉంటుంది. కానీ అడుగు బయటపెడితే మహమ్మారిని ఇంటికి ఆహ్వానించినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రూ బాల్డాక్, అతని స్నేహితుడు జాసన్ బైర్డ్ తో కలిసి లండన్ వీధిల్లో తిరుగుతూ సూపర్ మ్యాన్ వేషం వేసుకొని అక్కడి పిల్లలను ఎంటర్‌టైన్ చేశారు.
సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ తరగతులు బోధించే ఆండ్రూ ఓసారి క్లాస్‌కి సూపర్ మెన్‌లా డ్రెస్ చేసుకొచ్చాడట. ఆరోజు పిల్లల ముఖాల్లో విరిసిన చిరునవ్వులతో గతవారం నుంచి ఇలా వీధుల్లో తిరుగుతూ పిల్లలను సంతోషపెడుతున్నాడు. సూపర్‌మెన్ గెటప్‌లో వీళ్లు చేసే స్టంట్‌లు చూసి పిల్లలంతా సరదాగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి వీటికి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. వైరస్ మహమ్మరిని సైతం లెక్కచేయకుండా పిల్లల సంతోషం కోసం ఆండ్రూ, అతని స్నేహితుడు చేస్తున్న కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. మీరు నిజంగానే సూపర్ హీరోలు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.