దలైలామాను కలిస్తే నేరమే

Meeting Dalai Lama major offence, China warns world leaders .. - Sakshi

చైనా హెచ్చరిక

బీజింగ్‌: టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా(82)తో ఏ దేశాధినేత భేటీ అయినా, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చైనా హెచ్చరించింది. వేర్పాటువాదిగా మారిన దలైలామా తమ నుంచి టిబెట్‌ను విడదీయటానికి యత్నిస్తున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రారంభమైన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా యునైటెడ్‌ ఫ్రంట్‌ వర్క్‌ విభాగానికి చెందిన కార్యనిర్వాహక ఉపమంత్రి జాంగ్‌ ఇజియాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఏ దేశమైనా, ఏ సంస్థ లేదా వ్యక్తులైనా 14వ దలైలామాతో భేటీ కావడానికి యత్నిస్తే దాన్ని చైనా ప్రజల మనోభావాల దృష్ట్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం.

చైనా సార్వభౌమాధికారాన్ని గుర్తించిన అనంతరం దలైలామాతో భేటీ కావడమన్నది అందుకు విరుద్ధమైన చర్య అవుతుంది. మా సార్వభౌమాధికారాన్ని గుర్తించి, మాతో సత్సంబంధాలు కోరుకునే దేశాలన్నీ ఈ విషయమై పునరాలోచించాలి. దలైలామాను ఆధ్యాత్మిక నేతగా పేర్కొంటూ విదేశీ నేతలు చేసే వాదనల్ని మేం ఎంతమాత్రం అంగీకరించబోం. ఆయన మతం ముసుగు కప్పుకున్న రాజకీయ నేత’ అని మండిపడ్డారు. భారత్‌ను నేరుగా ప్రస్తావించకుండా ‘1959లో మాతృభూమికి ద్రోహం చేసిన దలైలామా మరో దేశానికి పారిపోయి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నార’ని విమర్శించారు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయాలన్న వేర్పాటువాద అజెండాతో దశాబ్దాలుగా దలైలామా బృందం పనిచేస్తూనే ఉందని ఆరోపించారు. అసలు టిబెట్‌ బౌద్ధం అన్నది చైనాలోనే పుట్టిందని ఇజియాంగ్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top