షాపింగ్‌ ఇష్యూ : దేశ అధ్యక్షురాలు రాజీనామా

Mauritius President To Resign Over Shopping - Sakshi

నైజీరియా : మారిషస్‌ అధ్యక్షురాలు అమీన గురిబ్ ఫకిమ్ వచ్చే వారంలో తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఆ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి ప్రవింద్‌ జుగ్నౌత్ ప్రకటించారు. మార్చి 12న దేశ 50వ  స్వాతంత్య్ర దినోత్సవం అయి పోయిన తర్వాత తమ దేశ అధ్యక్షురాలు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఒక చారిటీ సంస్థ ఇచ్చిన క్రెడిట్‌ కార్డును దుర్వినియోగపరిచి, పెద్ద మొత్తంలో షాపింగ్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అధ్యక్షురాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ క్రెడిట్‌ కార్డును వాడి పెద్ద మొత్తంలో వస్త్రాలను, జువెల్లరీని అధ్యక్షురాలు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్‌ కార్డు ఖర్చుపై ప్రధాని స్పందించలేదు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని మాత్రం ప్రధాని తెలిపారు. 

కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ అయిన గురిబ్‌-ఫకీమ్‌, 2015లో అధ్యక్షురాలు పదవి అలంకరించారు. ఐల్యాండ్‌ దేశంలో తొలి మహిళా అధ్యక్షురాలు ఈమే. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నగదును ఆమె వెనక్కి ఇచ్చేసినట్టు తెలిపారు. తాను ఎవరి దగ్గర్నుంచి ఎలాంటి మనీని తీసుకోలేదని, ఏడాది దాటిన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎందుకు ఈ విషయాన్ని మళ్లీ తవ్వి తీస్తున్నారంటూ మండిపడ్డారు. అధ్యక్షురాలికి జారీచేసిన ఈ క్రెడిట్‌ కార్డు ఎన్‌జీవో ప్లానెట్‌ ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందించింది. స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఈ ఆర్గనైజేషన్‌ విద్యావ్యాప్తికి కృషిచేస్తుంది. ఈ విషయంపై ఎన్‌జీవో ప్లానెట్‌ ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇంకా స్పందించలేదు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top