
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని 50 మందికి పైగా అమెరికన్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. పాలనా సంస్కరణల సభా కమిటీ ఛైర్మన్, ర్యాంకింగ్ మెంబర్‌కు రాసిన లేఖపై మహిళా ప్రతినిధులు సంతకాలు చేశారు.అమెరికా అంతటా మి టూ క్యాంపెయిన్‌లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులను వివరిస్తూ ముందుకొస్తున్న క్రమంలో ట్రంప్ వ్యవహారాలపై దర్యాప్తును కోరుతున్నామని అమెరికన్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు స్పష్టం చేశారు.
ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళలు చేస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు స్పందించాలని, తనను సమర్ధించుకునేందుకు ఆయన తగిన ఆధారాలు సమర్పించాలని మహిళా సభ్యులు ఈ లేఖలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు ట్రంప్ తమను అసభ్యకరంగా తాకాడని, అభ్యంతరకరంగా ప్రవర్తించాడని గత రెండేళ్లుగా దాదాపు 16 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిపై తమ ఆరోపణలకు సంబంధించి యూఎస్ కాంగ్రెస్ విచారణ చేపట్టాలని ఆయనపై ఆరోపణలు గుప్పించిన ముగ్గురు మహిళలు ఇటీవల డిమాండ్ చేశారు.
మరోవైపు తనపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలను 71 ఏళ్ల ట్రంప్ తోసిపుచ్చారు.తానింతవరకూ ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినీ లైంగికంగా వేధించలేదని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై అధ్యక్షుడు ఇప్పటికే వివరణ ఇచ్చారని, నిరాధార ఆరోపణలుగా కొట్టిపారవేశారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ స్పష్టం చేశారు.