
మైనార్టీల హక్కుల కార్యకర్త కృష్ణకుమారి కోల్హీ
కరాచీ : మైనార్టీల హక్కుల కార్యకర్త కృష్ణ కుమారి కోల్హీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెగ్గిన కోల్హీ పాక్ సెనేట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా నిలిచారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరపున సింధు ప్రావిన్స్ నుంచి పోటీ చేసిన 39 ఏళ్ల కృష్ణకుమారి విజయం సాధించారు. మహిళల అభివృద్ధి, మైనార్టీల హక్కుల రక్షణ కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు.
పీపీపీ నుంచి గతంలో రత్న భగవాన్ దాస్ తొలిసారి సెనేటర్‌గా ఎన్నికకాగా, ఆమె హిందూ మహిళ. కృష్ణకుమారి హిందూ దళిత మహిళ కావడంతో ఇలా ఈ హోదా పొందిన తొలి మహిళ అయ్యారు. సింధు ప్రావిన్స్ నుంచి రిజర్వ్‌డ్ సీట్ రావడంతో సామాజిక కార్యకర్త అయిన కోల్హీపై పీపీపీ నమ్మకం ఉంచి గెలిపించింది. కాగా, ఈ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ 15 స్థానాల్లో నెగ్గి పార్లమెంట్ ఎగువ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
కృష్ణకుమారి కోల్హీ 1979లో సింధు ప్రావిన్స్ థార్ జిల్లాలోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉమర్‌కోట్ జిల్లాలోని ఓ భూస్వామి కింద వీరి కుటుంబం నిర్బంధంలో ఉన్నది. అనంతరం 16 ఏళ్ల ప్రాయంలో లాల్‌చంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2013లో సింధు యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తిచేసిన కృష్ణకుమారి అదే ఏడాది పీపీపీలో చేరారు. పార్టీలో ఎదుగుతూ ఆపై బెరానో యూనియన్ కౌన్సిల్ చైర్మన్‌గా సేవలందించారు.