'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి' | Sakshi
Sakshi News home page

'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'

Published Wed, Dec 10 2014 6:21 PM

Kailash Satyarthi dedicates Nobel Prize to child rights activists

న్యూఢిల్లీ: తూర్పు-పశ్చిమ, ఉత్తర-దక్షిణ ప్రాంతాలన్నీ విశ్వశాంతి కోసం పాటుపడాలని ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. పాకిస్థాన్ ధీర బాలిక మలాలా యూసఫ్‌జాయ్తో కలసి కైలాస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కైలాస్ వేదాల్లోని ఓ శ్లోకాన్ని వినిపించి హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బహుమతిని బాలల హక్కుల కోసం  పోరాడుతున్న అందరికీ అంకితం చేస్తున్నట్టు చెప్పారు. మలాలా తనకు కూతురు లాంటిదని, ఓస్లో వేదికగా పాక్ కూతురును ఓ భారతీయ తండ్రి కలుసుకున్నారని కైలాస్ చెప్పారు. 'ప్రతి చిన్నారి స్వేచ్ఛగా పాఠశాలకు వెళ్లాలి. ఆడుకోవాలి. చిన్నారులెవరూ బాలకార్మికులుగా మారరాదు. విముక్తులయిన బాల కార్మికుల్లో ఈశ్వరుడిని చూశాను' అని కైలాస్ అన్నారు.

బుద్ధుడు జన్మించిన భూమి నుంచి నార్వే వరకు తన యాత్ర సాగిందని కైలాస్ అన్నారు. కైలాస్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. అధ్యాపక వృత్తికి గుడ్ బై చెప్పి బాలల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు.

Advertisement
Advertisement