బాలకార్మికులకు విముక్తి కలిగించిన ప్రయాణం నోబెల్‌కన్నా విలువైనది
నైతిక లోటు వల్లే యుద్ధాలు..హింస..ద్వేషం..వివక్షలు
సమానత్వం అనేది కొన్ని వర్గాలకు అందని ద్రాక్ష
కరుణ ప్రాధాన్యం నేపథ్యంగా ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంపాషన్’ రాశా
నేడు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో బుక్ ఆవిష్కరణ
‘సాక్షి’తో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి
సాక్షి, హైదరాబాద్: ‘మీరు చదువుకోవడానికే పుట్టారు, మేము పని చేయడానికే పుట్టాం’అని సాటి బాలుడు నా బాల్యంలోనే అన్న మాటలు నాకింకా గుర్తు. అప్పటి నుంచి లక్ష మందికిపైగా బాల కార్మికులకు విముక్తి కలిగించిన ప్రస్తుత ప్రయాణం వరకు చూసిన ఎన్నో అనుభవాలు నేను పొందిన నోబెల్ బహుమతి కన్నా ప్రభావవంతమైనవని’ సమాజ సేవకుడు, 50 ఏళ్ల నుంచి బాల కార్మిక నిర్మూలన కోసం విశేష కృషి చేస్తూ నోబెల్ శాంతి బహుమతి పొందిన కైలాష్ సత్యార్థి తెలిపారు. ఆయన అనుభవాలతో పాటు సామాజికంగా ‘కరుణ’ప్రాధాన్యం నేపథ్యంగా తాను రాసిన ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంపాషన్’ పుస్తకాన్ని శనివారం నగరంలో ప్రారంభం కానున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కైలాస్ సత్యార్థి ప్రత్యేకంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన పంచుకున్న అనుభవాలు, ఆలోచనలు ఆయన మాటల్లోనే..
నన్ను నడిపింది కరుణ మాత్రమే
ప్రపంచం ఎప్పుడూ లేనంత సంపన్నంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందింది. కానీ ఇదే సమయంలో ప్రపంచం ఇంతగా విభజించబడిన దశ మరొకటి లేదనే చెప్పాలి. దీని ప్రభావం మానవాళితో పాటు ప్రపంచ పర్యావరణంపైన కూడా పడుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం కరుణ లేకపోవడం. లక్ష మందికి పైగా బాల కార్మికులు, పిల్లల అక్రమ రవాణా నుంచి విముక్తి కలిగించడంలో నన్ను నడిపింది కరుణ మాత్రమే. నేటి ప్రపంచం సమస్యల సంద్రంలో కొట్టుమిట్టాడుతున్న వారికి పరిష్కారం అందించలేని ‘నైతిక లోటు’ప్రధాన సమస్య. ఈ లోటు వల్లే యుద్ధాలు, హింస, ద్వేషం, వివక్షలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు రాజకీయాలు, వ్యాపారం..అన్నింటిలోనూ దూకుడు పెరిగిపోయింది.
నిజమైన కరుణ ఒక సామాజిక శక్తి. లింగ వివక్ష, జాతి వివక్ష, యుద్ధాలు వంటి లోతైన సామాజిక సమస్యలను కేవలం దయతో పరిష్కరించలేం. దీని కోసమే నా పుస్తకంలో తొలిసారిగా ‘కంప్యాషన్ కోషెంట్’(సీక్యూ) అనే భావనను పరిచయం చేశా. ఇది ఒక వ్యక్తి సమస్యలను తనవిగా భావించి పరిష్కరించే సామర్థ్యం. భవిష్యత్తులో ఉద్యోగాలు, వివాహాలు కూడా సీక్యూ ఆధారంగా నిర్ణయించబడే రోజులు వస్తాయి. కరుణను పెంచేందుకు టెక్నాలజీ, ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తారు. దీనిని కొలిచే యాప్‌లు, డిజిటల్ టూల్స్ అభివృద్ధి చేయబడతాయి. ఇందులో న్యాయం, సమానత్వం, శాంతి, స్థిరత్వం ముఖ్యమైనవి.
సమానత్వం అనేది అందని ద్రాక్ష
బాల కార్మికత్వం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా నాన్న చనిపోయి ఎన్నో కష్టాలు ఉన్న ఆ సమయంలో మా అమ్మ చాలా భయపడింది. తనకున్న వెండి, బంగారం అంతా అమ్మి ఏదైనా ఆశ్రమం ప్రారంభించమంది. అదే సమయంలో ఇంజనీరింగ్ వృత్తి ఆపేయొద్దని కోరింది. అయినా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి నా ప్రయత్నాన్ని ఆపలేదు. నా భార్యతో కూడా ఈ విషయాలన్నీ చర్చించి, ఒప్పించాకే పెళ్లి చేసుకున్నాను. ఐదేళ్ళ వయస్సులో నేను స్కూల్‌కు వెళ్ళే సమయంలో నా వయసున్న ఒక బాలుడు మీరు చదువుకోవడానికే పుట్టారు, మేము పని చేయడానికే పుట్టాం అన్న మాటలు ఇప్పుడు గుర్తు చేసుకున్నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి.
సమానత్వం అనేది కొన్ని వర్గాలకు అందని ద్రాక్ష. ఈ ప్రభావంతోనే నా చిన్నతనంలోనే నా బ్రాహ్మణ ఇంటిపేరులోని శర్మను తీసేశాను. నా ప్రయాణంలో భాగంగా సుమారు 1400 వందల గ్రామాల్లో బాల కార్మికత్వం, వివక్ష లేకుండా వారిపై లైంగికంగా, సామాజికంగా దాడులు లేకుండా చేసి ఆ ఊళ్లలో బాల పంచాయితీలు సైతం నిర్వహించాను. అలా బాల పంచాయితీలు చేసిన పిల్లలు ఇప్పడు నిజమైన నాయకులుగా , సివిల్ సర్వెంట్లుగా మారి సేవ చేస్తున్నారు. మరి కొందరు యునైటెడ్ నేషన్స్ వేదిక పైన రాణిస్తున్నారు.
సత్వర న్యాయం అందినప్పుడే మార్పు సాధ్యం
సత్యార్థి మూవ్‌మెంట్ ఫర్ గ్లోబల్ కంపాషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న నా ఆశ్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు వచ్చి అవగాహన పొందుతున్నారు. నోబెల్ బహుమతి పొందిన లేమా బోవి సైతం సందర్శించారు. యువత కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 25 పోస్టుల కోసం అంతర్జాతీయంగా 2500 మంది దరఖాస్తు చేసుకోవడం చూస్తే ఈ తరం సామాజిక స్పృహను అర్థం చేసుకోవచ్చు. నా ఈ ప్రయాణంలో మీడియా కూడా అద్భుత సహకారం అందించింది. అప్పట్లో దూరదర్శన్‌లో పనిచేసే ఒక జర్నలిస్టు తన వృత్తికి రాజీనామా చేసి నాతో కలిసి పనిచేసింది.
సామాజిక మార్పులో న్యాయస్థానాలది కీలక పాత్ర. సామాజికంగా చిట్టచివరి వ్యక్తికి కూడా సత్వర న్యాయం అందినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో 15 మంది సుప్రీం కోర్టు జడ్జిలను కలిసి పలు అంశాలపై చర్చించాను, కొన్ని సోషల్ పాలసీల గురించి సూచనలు చేశారు. పోలీసులు, రాజకీయ నాయకులు, టీచర్లు, పోలీసులు ఇలా అందరూ వ్యక్తిగత అభిరుచితో భాగస్వామ్యం అయినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఒక డాక్టర్ మెడికేషన్‌తో పాటుగా కొన్ని నిమిషాలు రోగితో గడిపినప్పుడు ఆ రోగం నయమవుతుంది. మన సామాజిక సమస్యలు సైతం అలాంటివే.


