
ఆవుకు కంచర గాడిదలా చారలు వేసి ‘దీనివల్ల ఉపయోగం ఏమిటో తెలుసా’ అని చెప్పిన వారికి, పాదరక్షలు దుర్వాసన వేయకుండా ‘యూవీ–షూ ర్యాక్స్’ డిజైన్ చేసిన వారికి, పిజ్జాలను ఇష్టంగా తినే బల్లుల గురించి చెప్పిన పరిశోధకులకు నోబెల్ బహుమతులు వరించాయి. అయితే ఇవి ఉత్తుత్తి నోబెల్ బహుమతులు. చమత్కార, విచిత్ర ఆవిష్కరణలకు ఇచ్చే ఐజీ నోబెల్ బహుమతులు.
దుర్వాసన వల్ల ఇబ్బంది ఏమిటో అందరికీ తెలుసు. ఆ దుర్వాసనే ఇద్దరు భారతీయులకు ఐజీ నోబెల్ బహుమతి తీసుకువచ్చింది. కాలేజీ క్యాంపస్‌లో క్లాసురూమ్ బయట షూస్ కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. వాటి నుంచి దుర్వాసన వచ్చేది. దీనికి పరిష్కార మార్గం కనిపెట్టాలని అనుకున్నాడు సర్తక్ మిట్టల్. తన ్ర పొఫెసర్ వికాస్ కుమార్ (శివ్ నాడర్ యూనివర్శిటీ)తో కలిసి పరిశోధనలు మొదలు పెట్టాడు. ఎట్టకేలకు తమకు ఉన్న మైక్రోబయోలజీ, ఇంజనీరింగ్ జ్ఞానాన్ని ఉపయోగించి యూవీ ల్యాంప్స్‌తో ఫుట్‌వేర్‌ను శానిటైజ్ చేసే ర్యాక్‌ను తయారు చేశారు. వారి కృషికి గుర్తింపుగా వినూత్నమైన శాస్త్రీయ ఆవిష్కరణలకు ఇచ్చే ఐజీ నోబెల్ ప్రైజ్ వచ్చింది.
‘పులి చారలు వేసుకున్నంత మాత్రాన నక్క పులి కాదు’ లాంటిదే ‘నల్లటి చారలు వేసుకున్నంత మాత్రాన ఆవు జడలబర్రె కాదు’ అనేది సామెత. అయితే మాత్రం ఏమిటి? ఆ తెలుపు, నలుపు చారలే జ పాన్ పరిశోధ«క బృందానికి ఐజీ నోబెల్ బహుమతిని తీసుకువచ్చాయి. బహుమతి సరే, ఇంతకీ ఆ చారల వల్ల ఉపయోగం ఏమిటి? అనే విషయానికి వస్తే...
సదరు నలుపు, తెలుపు చారల వల్ల ఆవులకు దోమలు కుట్టవని పరిశోధనాత్మకంగా కనిపెట్టారు ఆవిష్కర్తలు. ఈ చారలు దోమలమందుకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ‘ఆవులకు రంగు వేయడం వల్ల దోమలు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించవచ్చు’ అంటున్నారు పరిశోధకులలో ఒకరైన టోమోకి కోజిమా.
ఆఫ్రికాలోని టోగో దేశంలో రెయిన్‌బో లిజార్డ్స్ పన్నీర్ పిజ్జాలను తినడానికి ఇష్టపడుతున్నాయని కనిపెట్టిన రోగెర్ మీక్‌కు, మద్య పానం చేయడం ఒక వ్యక్తి విదేశీ భాష మాట్లాడడాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేసిన మ్యాట్ ఫీల్డ్ బృందానికి, తన వేలి గోరు పెరుగుదలను 35 సంవత్సరాల పాటు రికార్డ్ చేసి, విశ్లేషించిన విలియం బీన్‌కు.
తాత్కాలిక నార్సిజానికి (తనను తాను గొప్పగా, ప్రత్యేకంగా భావించుకునే), హై ఐక్యూకు స్కోర్‌కు సంబంధం ఉంటుందని చెబుతున్న మార్కిన్, జిల్స్ గిగ్నాక్‌కు, తల్లి వెల్లుల్లి తింటే ఆ తల్లి పాలు తాగే శిశువు పొందే అనుభూతి గురించి పరిశోధించిన జూలీ మెనాల్లా, గ్యారీ బియోచాంప్‌లకు, టెఫ్లాన్ అనే ప్లాస్టిక్‌ను తినడంపై చేసిన విశ్లేషణకు రోటెమ్, డేనియల్‌లకు ఐజీ నోబెల్ బహుమతులు ఇచ్చారు.
అలా మొదలైంది...
ఐజీ నోబెల్ ప్రైజ్‌ను మొదట్లో తేలిగ్గా తీసుకునేవారు. నవ్వుకునేవారు. ఆ తరువాత మాత్రం ఐజీ నోబెల్‌కు ప్రాధాన్యత పెరిగింది. సైన్స్ హ్యూమర్ పత్రిక ‘అనల్స్ ఆఫ్ ఇం్ర పొబబుల్’ 1991లో తొలిసారిగా ఐజీ నోబెల్ బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించింది. జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంజనీరింగ్ డిజైన్, భౌతికశాస్త్రం... మొదలైన విభాగాలలో ఈ బహుమతులు ఇస్తారు. బోస్టన్(యూఎస్)లో విజేతలకు బహుమతులు ఇస్తారు. నిజమైన నోబెల్ గ్రహీతలు విజేతలకు బహుమతులు ఇస్తారు. ఈ సంవత్సరం ఐజీ నోబెల్ థీమ్: జీర్ణక్రియ. గెస్ట్ స్పీకర్‌లలో ఒకరైన త్రిషా ప్రస్రిచా టాయిలెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి పరిశోధించారు. ఐజీ నోబెల్ అవార్డ్‌లలో మన దేశానికి స్ట్రాంగ్ రికార్డ్ ఉంది.