జోకొట్టే పాపాయి

Women Book Writers Nobel Winners Special Story - Sakshi

జీవితం ఎలా ఉండాలి? ఎలాగైనా ఉండొచ్చు.  ఇంటికి చేరుకుని, ఇంత తిని పడుకున్నాక మాత్రం.. చేతులు గుండెలపైకి వెళ్లిపోవాలి. హాయిగా నిద్ర పట్టాలి. చేతులు డిస్టర్బ్‌ అవనంతగా! అంత ఇస్తుందా జీవితం? వెతుక్కోవాలి. బతుకు దారుల్లో దొరక్కపోతే.. బతుకునిచ్చే పుస్తకాల్లో..!  గుండెలపై పాపాయిని జో కొడతాం.  మనల్ని జోకొట్టే పాపాయి.. గుండెలపై బతుకు పుస్తకం.  ఆ పుస్తక ప్రదాతలు, ప్రదీప్తులు..ఈ నోబెల్‌ మహిళలు. 

అన్‌మిస్టేకబుల్, ఆస్టియర్‌ బ్యూటీ అనే మాటలు రెండు రోజులుగా సాహితీ ప్రపంచంలో వినిపిస్తున్నాయి. అమెరికన్‌ కవయిత్రి లూయీ గ్లూక్‌ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్‌ కమిటీ ఈ రెండు మాటలతో ఆమెను ప్రశంసించింది. తను ఏం రాసినా నిశ్చయంగా (అన్‌ మిస్టేకబుల్‌), నిరాడంబర బుది ్ధసౌందర్యంతో (ఆస్టియర్‌ బ్యూటీ) రాశారని, మనిషి గుండెకాయను తీసుకెళ్లి ఈ విశ్వానికి అమర్చి లబ్‌డబ్‌ మనిపించిన మహోన్నత సాహితీవేత్త అని కీర్తించింది.

గ్లూక్‌కి 77 ఏళ్లు. పదును తేలిన భావంలా మనిషి పలుచగా ఉంటారు. ఆటోబయోగ్రఫికల్‌ పొయెట్‌ అని ఆమెకు పేరు. అమెరికాలో ఆడపిల్లలు డిగ్రీ అయిపోగానే ‘సెక్రెటేరియల్‌’ వర్క్‌ చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. గ్లూక్‌ కూడా అలాగే చేరి, మానేశారు. తర్వాత పొయెట్రీ రాశారు. పొయెట్రీ ప్రొఫెసర్‌ అయ్యారు! గ్లూక్‌ కి ముందు ముగ్గురు అమెరికన్‌ మహిళలకు సాహిత్యంలో నోబెల్‌ వచ్చింది. టోనీ మారిసన్, పెర్ల్‌ బక్, సల్మ లాగెర్లాఫ్‌. 

టోనీ నవలా రచయిత్రి. తన భావధార అంతా అమెరికన్‌ రియాలిటీ. పొయెట్రీ అక్కడక్కడా పుదీనాలా పడిపోతుంది తనకు తెలియకే. జీవితమంతా రచనే. వేరే వ్యాపకం లేదు. విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా మాత్రం కాలేజీలకు వెళ్లొచ్చేవారు. మానవ సమాజశాస్త్రం ఆమె చెబుతుండగా విని వ్యక్తుల్ని కాకుండా, సమాజాన్ని ప్రేమించిన టీనేజర్‌లు ఉన్నార ని అంటారు! టోనీ 88 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆమెకన్నా 55 ఏళ్ల ముందు నోబెల్‌ పొందిన పెర్ల్‌ బక్‌ ఎనభై ఏళ్లు జీవించారు. అమెరికనే అయినా ఆమె జీవితంలోని ప్రారంభ కాలం అంతా చైనాలోని ఝెన్‌జియాంగ్‌ లో గడిచింది.

చైనా రైతుల జీవన స్థితిగతులపై ఆమె రచనలకు, తను రాసిన తన తల్లిదండ్రుల జీవిత కథలకు ఆమెకు నోబెల్‌ లభించింది. మరో అమెరికన్‌ సల్మ లాగెర్లాఫ్‌ సాహిత్యంలో నోబెల్‌ గెలుచుకున్న తొలి మహిళ. ఉత్కృష్టమైన ఆదర్శవాదం, స్పష్టమైన ఊహాత్మకత, ఆధ్యాత్మిక దృక్పథం ఆమె రచనల్లోని విలక్షణతలు. వాటిని నోబెల్‌ వరించింది. సల్మ ఎనభై ఏళ్లకు పైగా జీవించారు. గర్ల్స్‌ హైస్కూల్‌ టీచర్‌గా ఆమె కెరీర్‌ మొదలై, రచయిత్రిగా స్థిరత్వం పొందింది. 

అమెరికా తర్వాత ఒక్క పోలెండ్‌కు మాత్రమే సాహిత్యంలో రెండు మహిళా నోబెల్‌ ప్రైజులు దక్కాయి. రెండేళ్ల క్రితం ఓల్గా తొకర్జూక్, పాతికేళ్ల క్రితం విస్లావా సింబోర్సా్క నోబెల్‌ గెలుచుకున్నారు. ఓల్గా రచయిత్రి, యాక్టివిస్టు. ఆమె నేరేటివ్‌ ఇమాజినేషన్‌ గొప్పదని అంటారు. అంటే కథనాత్మక కల్పన. ఆమె మానవ జీవన విషయక్రమ జిజ్ఞాస ఆమె రచనల్ని ఎల్లలు దాటించడమే ఆమెకు నోబెల్‌ రావడానికి కారణం అయింది. ఇక విస్లావా సింబోర్సా్క కవయిత్రి. వక్రోక్తుల వినయశీలి. మానవ జీవితంలోని చారిత్రకతల్ని కవితలు గా అల్లారు. అమెరికన్‌ నోబెల్‌ గ్రహీత టోనీలానే ఈమె కూడా సరిగ్గా 88 ఏళ్లు జీవించారు. తక్కిన పదిమంది మహిళా నోబెల్‌ విజేతలతో నాడైన్‌ గార్డిమర్‌ (దక్షిణాఫ్రికా), గేబ్రియేలా మిస్ట్రెల్‌ (చిలీ), ఆలిస్‌ మన్రో (కెనడా) మినహా అంతా ఐరోపా మహిళలే.

నాడైన్‌ గార్డిమర్‌ రచయిత్రి, రాజకీయ కార్యకర్త. తొంభై ఏళ్లు జీవించారు. నోబెల్‌ ప్రైజ్‌ వ్యవస్థాపకులైన ఆల్ఫ్రెడ్‌ ఏ మానవాళి ప్రయోజనాన్నయితే ఆశించి నోబెల్‌ను నెలకొల్పారో ఆ ప్రయోజనమే అంతర్లయగా నాడైర్‌ రచనల్లో ఉండేది. గేబ్రియేలా మిస్ట్రెల్‌ గేయ కవయిత్రి. దట్టించిన ఉద్వేగం ఆమె ప్రతి వ్యక్తీకరణ. మధ్య అమెరికా వాసుల ఆదర్శప్రాయమైన ఆకాంక్షలకు ఆమె ఒక సంకేతాత్మకంగా వెలుగొందారు. విద్యావేత్త, మానవ ప్రేమిక. చిలీ దేశపు పద్యరాయబారి. 67 ఏళ్లు జీవించారు. ఆలిస్‌ మన్రో అయితే చిన్న కథల్లో చెయ్యి తిరిగిన కథనశిల్పి. థీమ్‌ జీవితాదర్శం. ఆ కథాచాతుర్యానికే నోబెల్‌ పడిపోయింది. 89 ఏళ్ల ఆలిస్‌ మన్రో ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

ఐరోపా నుంచి సాహిత్యంలో నోబెల్‌ గెలుచుకున్న ఏడుగురు మహిళలూ ప్రధానంగా దేశవాళీ జీవనాంశాలను, జీవిత సమస్యలను కథాంశాలుగా తీసుకుని ఆదర్శప్రాయమైన పరిష్కారాలను విశ్లేషించినవారే. గ్రేసియా డెలెడా (ఇటలీ), సిగ్రిడ్‌ అండ్సెట్‌ (నార్వే), నెలీ సాచ్‌ (జర్మనీ), ఎల్‌ఫ్రీడ్‌ జెలినెక్‌ (ఆస్ట్రియా), డోరిస్‌ లెస్సింగ్‌ (బ్రిటన్‌), హెర్టా మ్యూలర్‌ (రొమేనియా), స్వెత్లానా అలెక్సివిచ్‌ (ఉక్రెయిన్‌) తమ రచనా వైవిధ్యాలను కనబరచడంతో పాటు సామాజిక ప్రతిఫలనాలను ఉన్నవి ఉన్నట్లుగా తమ వచనం చేసుకున్నారు. గ్రేసియా డెలడా మానవ జీవన సంక్లిష్టతలను సానుభూతితో తర్కించారు. సిగ్రిడ్‌ నార్వేలోని మధ్యయుగాల నాటి జీవితాన్ని శక్తిమంతంగా దర్శనం చేయించారు. నెలీ సాచ్‌ ఇజ్రాయెల్‌ భవిష్యత్‌ను కవిత్వీకరించారు. ఎల్‌ఫ్రీడ్‌ జెలినెక్‌ సమాజంలోని అర్థరహితాలను, అపసవ్యతల్ని గుండెకు హత్తుకునే గాఢమైన భావాలతో వ్యక్తం చేశారు. డోరిస్‌ లెస్సింగ్‌ నాగరికతల్ని, హెర్తా మ్యూలర్‌ ‘కోల్పోవడాన్ని’, స్వెత్లానా అలెక్సివిచ్‌ మానవ జన్మ వ్యాకులతల్ని స్పృశించారు. వాటికి దక్కిన గుర్తింపే నోబెల్‌. దీనిని మనం నోబెల్‌కు దక్కిన గుర్తింపు అని కూడా అనొచ్చు.

జోకొట్టే పాపాయి పంచుకుంది ఒక్కరే
నోబెల్‌ బహుమతులు ప్రారంభం అయిన 1901 నుంచి 2020 వరకు సాహిత్యంలో 113 సార్లు నోబెల్‌ ప్రదానం చేశారు. 117 మంది నోబెల్‌ గ్రహీతలు అయ్యారు. వీరిలో 101 మంది పురుషులు. 16 మంది స్త్రీలు. తాజా గ్రహీత అమెరికన్‌ కవయిత్రి లూయీస్‌ గ్లూక్‌. తొలి మహిళా విజేత స్వీడన్‌ రచయిత్రి సల్మ లాగెర్లాఫ్‌ (1909). సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని ఒక పుస్తకానికి అంటూ ఇవ్వరు. మొత్తం రచనల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే తొమ్మిదిసార్లు మాత్రం పుస్తకానికి నోబెల్‌ ఇవ్వవలసి వచ్చింది. ఆ తొమ్మిది మందిలో మహిళలు లేరు. నోబెల్‌ సాహిత్య బహుమతిని మిగతా కేటగిరీలో మాదిరిగా ఇద్దరికి ముగ్గురికి పంచరు. ఒకరికే ఇస్తారు. అయితే నాలుగుసార్లు ఇద్దరిద్దరికి పంచవలసి వచ్చింది. అలా నోబెల్‌ను పంచుకున్న ఒకే ఒక మహిళ జర్మనీ కవయిత్రి నెలీ సాచ్‌ (1966).

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top