
వెల్త్ మేనేజ్‌మెంట్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మహిళలు కుటుంబ సంపదకు కేవలం లబ్ధిదారులుగానే ఉండిపోకుండా, సంపద సృష్టి, నిర్వహణ, బదలాయింపులోను కీలకంగా మారుతున్నారు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణి ప్రధానంగా ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్‌లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం, ప్రపంచ సంపదలో మూడో వంతు భాగాన్ని మహిళలు నిర్వహిస్తున్నారు. ఇవి అంకెలు మాత్రమే కావు. సాంస్కృతిక, ఆర్థిక అంశాల్లో చోటు చేసుకుంటున్న గణనీయమైన మార్పులను సూచిస్తున్నాయి. చాలా మంది మహిళలు సంపదను కేవలం వారసత్వంగా పొందడమే కాకుండా, దాన్ని జాగ్రత్తపర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఎంట్రప్రెన్యూర్‌షిప్, పెట్టుబడులు లేదా ఫ్యామిలీ ఆఫీసులు.. ఇలా ఏ రూపంలోనైనా కావచ్చు భవిష్యత్తులో కుటుంబ సంపదపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైన స్థాయిల్లోకి వారు చేరుకుంటున్నారు. తరతరాలుగా సంపద నిర్వహణలో వస్తున్న ఫండమెంటల్ మార్పును ఇది సూచిస్తోంది.
బార్‌క్లేస్ ప్రకారం సంపన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మంది మహిళల్లో ఎనిమిది మందికి, వచ్చే రెండు దశాబ్దాల్లో గణనీయమైన స్థాయిలో సంపద వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ విషయానికొస్తే వారిలో సగం మంది కూడా ఇందులో పాలుపంచుకోవడం లేదు. దీన్ని సత్వరం పరిష్కరించాల్సి ఉంది.
చివరిగా..
వెల్త్ మేనేజ్‌మెంట్‌లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆఫీస్‌లు, ప్రైవేట్ వెల్త్‌లో మహిళలు మరింతగా పాలుపంచుకోవడమనేది ట్రెండ్ మాత్రమే కాదు. కుటుంబ వారసత్వం, సంపద సృష్టి, సంపద బదలాయింపును మనం చూసే దృష్టి కోణంలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తోంది. ఫ్యామిలీ ఆఫీస్‌లలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న మహిళలు, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగం భవిష్యత్తును నిర్దేశించనున్నారు. సంపద సృష్టి, సంరక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా భవిష్యత్ తరాలకు సంపద బదలాయింపులో మార్గదర్శకత్వం వహించడం.. ఇలా కుటుంబ సంపదకు సంబంధించిన ఏ అంశంలోనైనా మహిళలు మరింత కీలక పాత్ర పోషించనున్నారు.
కుటుంబ సంపద నిర్వహణ విషయంలో మహిళలు మరిన్ని బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో, మారుతున్న క్లయింట్ల అవసరాలను పరిష్కరించేలా వెల్త్ మేనేజర్లు తమను తాము మార్చుకోవాలి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో చురుకైన పాత్ర పోషించేలా మహిళలకు సాధికారత కల్పించడమనేది ఒక వ్యూహాత్మక అవసరం కూడా.
భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం..
భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు కూడా పాలుపంచుకోవడం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా సంపద బదలాయింపు, వారసత్వ ప్రణాళికల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. వారు ఆర్థిక భద్రత, భవిష్యత్ తరాలకు స్థిరత్వం కల్పించడానికి అధిక విలువనిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్లిష్టమైన ఆర్థిక కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో మహిళలకు సాధికారత కల్పించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం నుంచి మహిళల లక్ష్యాలు, విలువలకు అనుగుణమైన కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అందించే వరకు వారి ప్రాధాన్యతలకు అనుగుణమైన సర్వీసులను వెల్త్ మేనేజర్లు అందించాల్సి ఉంటుంది.
ఫ్యామిలీ ఆఫీసుల విషయానికొస్తే, సంపద సృష్టి, నిర్వహణలో మారుతున్న మహిళల పాత్రలకు అనుగుణంగా తోడ్పాటు అందించేలా వెల్త్ మేనేజ్‌మెంట్ రంగం మారాలి. నిర్ణయాల్లోనూ వారికి చోటు లభించేలా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. పూర్తి సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడంలో మహిళలకు అవసరమైన పరిజ్ఞానం, సాధనాలు, ఆత్మవిశ్వాసం లభించే విధంగా ఆర్థిక అంశాలపై సంప్రదింపుల్లో ఫ్యామిలీ ఆఫీసులు తప్పనిసరిగా మహిళలను కూడా భాగం చేయాలి.
- అరుణిమ నయన్
హెడ్ – ఫ్యామిలీ ఆఫీస్ – ప్రైవేట్ వెల్త్, యాక్సిస్ ఏఎంసీ