అమెజాన్‌కూ ఆ గతి పట్టొచ్చు..

Jeff Bezos Says Amazon will Go Bankrupt One Day   - Sakshi

న్యూయార్క్‌ : ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కుప్పకూలుతుందని, దివాళా బాట పడుతుందని ఇప్పట్లో ఎవరూ ఊహించరు. అయితే అమెజాన్‌ ఏదో ఒక రోజు పతనమవుతుందని, దివాళా తీస్తుందనీ సాక్షాత్తూ సంస్థ వ్యవస్ధాపకులు జెఫ్‌ బెజోస్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీటెల్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో జరిగిన ప్రత్యేక భేటీలో ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బెజోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

రిటైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభంతో పాటు అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ చైన్‌ సియర్స్‌ దివాళా తీయడం నుంచి మీరు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారని ఓ ఉద్యోగి అమెజాన్‌ అధినేతను ప్రశ్నించారు. అమెజాన్‌ సైతం పడిపోకుండా ఉండేంత దిగ్గజమేమీ కాదని బెజోస్‌ బదులిచ్చి ఉద్యోగులను విస్మయంలో ముంచెత్తారని సీఎన్‌బీసీ న్యూస్‌ పేర్కొంది.

దిగ్గజ కంపెనీలను పరిశీలిస్తే అవి మూడు దశాబ్ధాలకు పైబడి వాటి జీవితకాలం సాగిందని, వందేళ్లకు పైగా మనుగడ కొనసాగించినవి లేవని ప్రస్తావించినట్టు తెలిపింది. అమెజాన్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి సంస్థ మనుగడ ముగిసిపోకుండా వీలైనంత పొడిగించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బెజోస్‌ పిలుపు ఇచ్చారు. మనం కస్టమర్లపై కాకుండా మనపైనే దృష్టి కేంద్రీకరిస్తే అదే పతనానికి ప్రారంభమవుతుందని హెచ్చరించారు. అలాంటి రోజు రాకుండా దాన్ని నివారించడానికి మనం శక్తివంచన లేకుండా ప్రయత్నించాలన్నారు.

కాగా న్యూయార్క్‌ లాంగ్‌ ఐలాండ్‌ సిటీ ప్రాంతంతో పాటు వాషింగ్టన్‌ డీసీల్లో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని గతవారం అమెజాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేంద్రాలతో రెండు నగరాల్లో 25,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top