లాక్‌డౌన్‌: హాలీడే ట్రిప్‌లో ఇవాంక దంపతులు!

Ivanka Trump And Husband Went For Jewish Holiday Trip Skip Lockdown - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా(కోవిడ్‌-19) ధాటికి అమెరికాలో 33 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 6,54,343కు చేరుకుంది. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని.. అమెరికన్లు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌ భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వార్తలు బయటకు రావడంతో ట్రంప్‌ కుటుంబంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక.. తానే వాటిని ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మహమ్మారిని తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. (హెల్త్‌ వాలంటీర్‌గా స్వీడన్‌ యువరాణి)

వివరాలు.. ఇవాంక, తన భర్త జారేద్‌ కుష్నర్‌తో కలిసి జ్యూయిష్‌ హాలిడే(యూదుల పండుగ- పాసోవర్‌ సెలబ్రేషన్స్‌) కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్‌ 8న ప్రారంభమైన పాసోవర్‌ సెలబ్రేషన్స్‌ కోసం వాషింగ్టన్‌లోని తన నివాసం వీడి గురువారం వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితమైన తర్వాత.. ఇవాంక బెడ్‌మినిస్టర్‌లోని ట్రంప్‌ కుటుంబానికి చెందిన గోల్ఫ్‌ రిసార్టుకు వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. ఆమెతో పాటు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని... ఇవాంక నివాసం కంటే అక్కడే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ‘‘బెడ్‌మినిస్టర్‌లో ఇవాంక భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ప్రయాణం వ్యాపార సంబంధమైనది కాదు. తన కుటుంబంతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు’’అని ఓ ప్రకటనలో తెలిపాయి. (‘ఏప్రిల్‌ చివరి నాటికి ఆ రాష్ట్రాలు తెరుచుకుంటాయి’)

కాగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రాణాంతక వైరస్‌ విస్తరిస్తున్న తొలినాళ్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉండాలంటూ ఇవాంక ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మనమంతా తెలిసోతెలియకో కోవిడ్‌ వ్యాప్తిలో భాగస్వాములం అవుతాం. భౌతిక దూరం ఒక్కటే మన ప్రాణాలు కాపాడుతుంది’’అని ఇవాంక విజ్ఞప్తి చేశారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాంకపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి అందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(మరణాలు @ 33 వేలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top