హచ్‌ డాగ్‌లా వెంటే.. వెన్నంటే.. 

Iridium NEXT will find out the missed plane Recognize and alert in moments - Sakshi

wherever you go our network follows  

2014,  మార్చి 8.. 239 మంది ప్రయాణికులతో బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎంహెచ్‌ 370 అంతుచిక్కని రీతిలో మాయమైంది...  అన్ని రకాల టెక్నాలజీలను వాడి వెతికారు.. ఇదిగో తోక..అదిగో రెక్క అన్నారు..  మూడేళ్లకుపైగా వెతికారు..చివరికి ఎక్కడుందో కనుక్కోలేక చేతులెత్తేశారు..  విమానం ఎక్కడో కూలి ఉంటుందని..అందరూ చనిపోయిఉంటారని చెబుతూ కేస్‌ క్లోజ్‌ చేశారు.. 
ఇంతకీ అదెక్కడ కూలింది.. ఆ విమానానికి ఏమైంది అని అడిగితే ఏమో.. ఎవరిని అడిగినా ఇదే జవాబు.. 

అయితే, ఇకపై అలా ఉండదు..ఈ భూప్రపంచం మొత్తమ్మీద ఏ విమానం ఎటు వెళ్లినా.. ఎటు కదిలినా..అనుక్షణం పర్యవేక్షించే  కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది..విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా..క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది.. అదే ఇరిడియం నెక్ట్స్‌.. 

ఇరిడియం నెక్ట్స్‌.. ఇందులో భాగంగా మొత్తం 75 ఉపగ్రహాలను మోహరిస్తున్నారు. తాజాగా ఇందులోని చివరి 10 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ మొత్తం ఉపగ్రహాల వ్యవస్థ భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి.. విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 
ఇప్పటివరకూ ఇలా..
ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ గ్రౌండ్‌ సిస్టం ద్వారా ట్రాక్‌ చేస్తున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఉండే బ్లాక్‌ బాక్స్‌ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్‌ అందుతుంది. ఎంహెచ్‌ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్‌ బాక్స్‌ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. అసలు.. ఆ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆ విమానం ఎక్కడుంది అన్న విషయాన్ని ట్రాక్‌ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. ఇరిడియం నెక్ట్స్‌ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఉపగ్రహాలు అన్ని విమానాలను కనిపెట్టుకుని ఉంటాయి. తేడా వస్తే. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు సమాచారమందిస్తాయి. అంటే.. ఇక భవిష్యత్తులో ఎంహెచ్‌ 370లాంటి మిస్టరీలకు చోటు లేదన్నమాట.. ప్రమాదం జరిగినా.. ఎక్కడ జరిగిందన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది కనుక.. సహాయక చర్యలను వెంటనే చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ఇరిడియం.. ఇరగదీసే ఐడియా కదూ..  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌.. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top