పార్లమెంట్‌లో అమెరికా జెండాకు నిప్పు

Iranian Politicians Set The US Flag On Fire - Sakshi

తెహ్రాన్‌ : ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో, ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా మిత్రదేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఇటు ఇరాన్‌ సైతం డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఈ అనూహ్య ప్రకటనపై తీవ్రంగా మండిపడుతోంది. ఇరాన్‌ చట్టసభ్యులు ఏకంగా తమ పార్లమెంట్‌లో అమెరికా జెండానే తగులబెట్టేశారు. ‘అమెరికాకు మరణం’ అంటూ ఆందోళన చేశారు. బుధవారం ఉదయం తెహ్రాన్‌లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సుమారు 20 మంది చట్టసభ్యులు స్పీకర్‌ చాంబర్‌ వద్దకు వెళ్లి ఈ ఆందోళన చేపట్టారు. బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మంగళవారం రాత్రి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నీ ఇరాన్‌పై తిరిగి విధిస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం విధ్వంసకరమన్నారు. తమ నిర్ణయాన్ని కాదని ఏ దేశమైనా ఇరాన్‌కు సహకారం అందిస్తే అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్రంప్‌ చేసిన ఈ ప్రకటనతో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలను నమ్మొద్దని ఇరాన్‌ చట్టసభ్యుడు అయతోలహ్‌ అలీ ఖమెనెయి ఆరోపించారు. ఇరాన్‌ డీల్‌కు సంబంధించిన సింబాలిక్‌ కాపీని సైతం అమెరికా జెండాతో పాటు తగులపెట్టేశారు. దేశీయ బాలీస్టిక్‌ మిస్సైల్‌ ప్రొగ్రామ్‌పై తాము వెచ్చిస్తూనే ఉంటామని చట్టసభ్యులు అమెరికాను హెచ్చరించారు. అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో, ఈ విషయాలను డీల్‌ చేసే విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌కు మానసిక సామర్థ్యం సన్నగిల్లినట్టు తెలుస్తుందని చట్టసభ్యులు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు గత రాత్రి చేసిన కామెంట్లు చాలా సిల్లీగా ఉన్నాయని అయతోలహ్‌ అలీ ఖమెనెయి అన్నారు. ఆయన చేసిన కామెంట్లలో 10కి పైగా వ్యాఖ్యలు నిరాధారమైనవేనని, ట్రంప్‌ పాలనలో అంతా ముప్పేనని  ఆరోపించారు. ‘ఇరాన్‌ ప్రజల తరుఫున చెబుతున్నా. మీరు చేసింది చాలా పెద్ద తప్పు’ అని అన్నారు. ఖమెనెయి ఇప్పటికే పలుమార్లు అమెరికాపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో అ‍త్యధిక అథారిటీ కలిగిన నేత ఖమెనెయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top