breaking news
Iran Parliament
-
Hijab: నిరసనకారులకు గుణపాఠమా?!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన అందరికీ ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది. 290 మంది సభ్యులున్న ఇరాన్ పార్లమెంటులో 227 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మసూద్ సెతాయ్షి నవంబర్ 6వ తేదీన పార్లమెంటు సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలియజేశారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 15 వేల మంది అరెస్టయ్యారు. నిర్ణయాత్మక శిక్ష అంటే మరణ శిక్షా అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇరాన్ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాలి. మనిషి మనుగడ పూర్తిగా ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిపోవడం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవాంఛనీయం. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన సుమారు 15 వేల మందికి ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి నియమించిన 16 మంది మానవ హక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. నవంబర్ 11వ తేదీన ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిరసనలను, ఉద్యమాలను అణచి వేయాలనే లక్ష్యంతో ఇరాన్ ప్రభుత్వం విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ప్రాథమికమైన స్వేచ్ఛను సాధించుకోవడానికి చేస్తున్న ఉద్యమాలను అణచివేసే పద్ధతిని మానుకోవాలని కోరారు. ఇప్పటికే... అంటే అక్టోబర్ 29న తెహరాన్ రాష్ట్ర పరిధిలోని ఇస్లామిక్ రివల్యూషన్ కోర్టు ఈ ఉద్యమంలో పాల్గొన్న 8 మందికి మరణశిక్షను విధించింది. ఇరాన్ చట్టం ప్రకారం ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం’ అనే నిబంధన ప్రకారం ఈ శిక్షలు విధిస్తారు. అదేవిధంగా అదే కోర్టు ప్రాసిక్యూటర్ మరో వేయిమంది పేర్లను ఈ కేసులో చేర్చారు. దీని తర్వాతనే ఇరాన్ పార్లమెంటు అన్ని కోర్టులకు ఇదే విధమైన కఠిన చర్యలను తీసుకోవాలని తీర్మానించింది. ఒక ఉద్యమంలో పాల్గొన్నందుకు మూకుమ్మడిగా ‘15 వేల మందికి’ పైగా కార్యకర్తలకు ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించాలని ఒక ప్రజాప్రతినిధుల సభ తీర్మానం చేయడం ప్రపంచ చరిత్రలోనే చాలా దుర్మార్గమైన చర్య. ఇంతమందికి గుణపాఠం నేర్పాలని ఇరాన్ ప్రభుత్వం ఎందుకు అంతగా ఉద్రేకపడుతున్నదనేది ప్రశ్న. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇరాన్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 638లో పేర్కొన్నదాని ప్రకారం హిజాబ్‌ను ఉల్లంఘిస్తే, పదిరోజుల నుంచి రెండు నెలల వరకు జైలు శిక్షను అనుభవించాలి. 55,500 రూపాయల జరిమానాను చెల్లించాలి. ఇంకా అవసరమైతే 74 కొరడా దెబ్బల శిక్షను కూడా అమలు చేస్తారు. కోర్టుకన్నా ముందు హిజాబ్‌ను సక్రమంగా పాటిస్తు న్నారా లేదా అని పర్యవేక్షించడానికి ‘మెరాలిటీ పోలీసు’ ప్రత్యేక విభాగమే ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న 22 ఏళ్ళ కుర్దిష్–ఇరానియన్ యువతి మహసా అమీని హిజాబ్‌ను సక్రమంగా ధరించలేదని అరెస్టు చేశారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. తెహరాన్ నగరాన్ని చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చింది. అమీనీని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించుకొని, తీసుకెళ్ళారు. అదే వాహనంలో ఆమెను కొట్టి, తీవ్రంగా హింసించినట్టు ఆమె సోదరుడు చెప్పారు. ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు చేతులు నల్లగా మారిపోయిన స్థితిలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పితే, వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మూడు రోజుల తర్వాత మహసా అమీని మరణించింది. ప్రభుత్వం మాత్రం ఆమె గుండెనొప్పితో బాధపడితే కుటుంబానికి అప్పజెప్పామని ప్రకటించింది. ఈ దారుణానికి నిరసనగా, వేలమంది వీధుల్లోకి వచ్చి ‘మహిళ–జీవితం–స్వేచ్ఛ’ అంటూ యావత్ ప్రపంచమే కదలిపోయే మహిళా ప్రభంజనానికి ఊపిరిలూదారు. ప్రపంచ మహిళా ఉద్యమాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలువదగిన మహోద్యమాన్ని ప్రారంభిం చారు. పోలీసులు, భద్రతా బలగాలు తమ నిర్బంధ కాండతో ఉద్యమాన్ని అణచివేయాలని చూశాయి. నిరసన ఆరంభమైన వారం రోజులకే అంటే సెప్టెంబర్ 20న పదహారేళ్ల నికా శకరామీని అపహరించి, చంపేశారు. సెప్టెంబర్ 21న 22 ఏళ్ళ హదీస్ నజఫీ కూడా భద్రతా బలగాల చేతిలో బలైపోయింది. ఈ రెండు ఘటనలూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకూ 326 మందిని ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఇరాన్ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. ఇందులో 43 మంది పిల్లలు, 25 మంది మహిళలున్నారు. ఈ ఉద్యమంలో కేవలం మహిళలే కాకుండా, మగవారు, ప్రత్యేకించి కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు మహిళలకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేవలం హిజాబ్‌కు వ్యతిరేక ఉద్యమం మాత్రమే కాదు, అయాతుల్లాహ్ ఖొమైనీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల నిరసన కూడా. ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఈనాటిది కాదు. 1935 నాటికి సాంప్రదాయికంగా అమలులో ఉన్న హిజాబ్ విధానాన్ని రజా షా ప్రభుత్వం సడలించింది. ఇది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాదని తేల్చి చెప్పింది. అయితే 1979లో ఇరాన్లో సంభవించిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మళ్ళీ హిజాబ్‌ను తప్పనిసరి చేశారు. 1983 వరకు ఇది పకడ్బందీగా అమలు జరిగింది. 1979 హిజాబ్ నిర్భంధాన్ని మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. కానీ 1983లో అది మళ్ళీ అమలులోకి తెచ్చారు. అయినా నిరసన ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ 2017లో, ఇరాన్ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. హిజాబ్‌ను సక్రమంగా ధరించకపోతే, అరెస్టులు ఉండవని చెప్పింది. చిన్న చిన్న జరిమానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణ యాన్ని పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు పాత పద్ధతిలోనే మహిళలపై వేధింపులను కొనసాగించారు. 2018లో ఫర్హాద్ మెసామీ అనే డాక్టర్ హిజాబ్ ఆంక్షలను సంపూర్ణంగా తొలగించాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ని అరెస్టు చేసి, జైలుకి పంపారు. 2019 ఏప్రిల్‌లో నస్రీన్ సోతోదేహ్ అనే మానవ హక్కుల కార్యకర్త జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని 38 సంవత్సరాల జైలు, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2019 ఆగస్ట్‌లో ఇరాన్ పౌరహక్కుల కార్యకర్త సబా కొర్ద్ అఫ్షారీ బహిరంగంగా తన హిజాబ్‌ను తొలగించినందుకు 24 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఇవన్నీ కేవలం దేశభద్రత, దైవదూషణ పేరుతో వేసిన కఠోర శి„ý లేనన్న విషయం మర్చి పోకూడదు. 2022 జూలైలో సెపిదే రష్ను అనే రచయిత్రిని కూడా హిజాబ్ నేరం కింద అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ దెబ్బ లతో ఆమె చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిరసనగా వందలాది మంది మహిళలు బహి రంగంగా ముఖం మీద, తలమీద ఉన్న దుస్తులను తొలగించి నిరసన తెలిపారు. 2022 ఆగస్ట్ 15న హిజాబ్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను ప్రభుత్వోద్యోగాల నుంచి తొలగించడం లాంటి కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ పరంపరలోనే సెప్టెంబర్ 13న మహసా అమీనీ అరెస్టు, తదనంతరం ఆమె మరణం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ఇరాన్‌లోనే కాదు, చాలా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల జీవి తాల్లోకి, వారి అలవాట్లలోకి చొరబడి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను నలిపి వేస్తున్నాయి. మన దేశంలో కొన్ని చోట్ల ఇటీవల హిజాబ్ ధరించిన ముస్లిం యువతులను వేధించే సంఘ టనలు జరిగాయి. ఇరాన్లో బలవంతంగా హిజాబ్‌ను అమలు చేయడం, భారత్‌లో తమ ఇష్టాలకు, అభిప్రాయాలకు భిన్నంగా హిజాబ్‌ను తొలగించాలని చూడడం రెండూ తప్పే. ప్రజలు తినే తిండి మీద, ధరించే దుస్తుల మీద, మాట్లాడే భాష మీద, ఆచరించే అల వాట్ల మీద ఆంక్షలు విధించడం, వేధించడం ఎంతమాత్రం వాంఛ నీయం కాదు. ప్రస్తుతం ఇరాన్లో పార్లమెంటు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనీ, ఇరాన్ మహిళల హక్కులను రక్షించాలనీ, అంతిమంగా మానవ హక్కులను పరిరక్షించాలనీ ప్రపంచ ప్రజలంతా ఇరాన్ మహిళలకు అండగా నిలబడాలి. మనమంతా ఒక్కటే అనే భావనను ఎలుగెత్తి చాటాలి. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 81063 22077 -
పార్లమెంట్లో అమెరికా జెండాకు నిప్పు
తెహ్రాన్ : ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో, ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా మిత్రదేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఇటు ఇరాన్ సైతం డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ అనూహ్య ప్రకటనపై తీవ్రంగా మండిపడుతోంది. ఇరాన్ చట్టసభ్యులు ఏకంగా తమ పార్లమెంట్లో అమెరికా జెండానే తగులబెట్టేశారు. ‘అమెరికాకు మరణం’ అంటూ ఆందోళన చేశారు. బుధవారం ఉదయం తెహ్రాన్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సుమారు 20 మంది చట్టసభ్యులు స్పీకర్ చాంబర్ వద్దకు వెళ్లి ఈ ఆందోళన చేపట్టారు. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మంగళవారం రాత్రి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నీ ఇరాన్‌పై తిరిగి విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం విధ్వంసకరమన్నారు. తమ నిర్ణయాన్ని కాదని ఏ దేశమైనా ఇరాన్‌కు సహకారం అందిస్తే అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలను నమ్మొద్దని ఇరాన్ చట్టసభ్యుడు అయతోలహ్ అలీ ఖమెనెయి ఆరోపించారు. ఇరాన్ డీల్‌కు సంబంధించిన సింబాలిక్ కాపీని సైతం అమెరికా జెండాతో పాటు తగులపెట్టేశారు. దేశీయ బాలీస్టిక్ మిస్సైల్ ప్రొగ్రామ్‌పై తాము వెచ్చిస్తూనే ఉంటామని చట్టసభ్యులు అమెరికాను హెచ్చరించారు. అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో, ఈ విషయాలను డీల్ చేసే విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మానసిక సామర్థ్యం సన్నగిల్లినట్టు తెలుస్తుందని చట్టసభ్యులు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు గత రాత్రి చేసిన కామెంట్లు చాలా సిల్లీగా ఉన్నాయని అయతోలహ్ అలీ ఖమెనెయి అన్నారు. ఆయన చేసిన కామెంట్లలో 10కి పైగా వ్యాఖ్యలు నిరాధారమైనవేనని, ట్రంప్ పాలనలో అంతా ముప్పేనని ఆరోపించారు. ‘ఇరాన్ ప్రజల తరుఫున చెబుతున్నా. మీరు చేసింది చాలా పెద్ద తప్పు’ అని అన్నారు. ఖమెనెయి ఇప్పటికే పలుమార్లు అమెరికాపై బహిరంగంగా విరుచుకుపడ్డారు. ఇరాన్లో అత్యధిక అథారిటీ కలిగిన నేత ఖమెనెయి. -
వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలం!
టెహ్రాన్: పశ్చిమాసియా దేశమైన ఇరాన్ వరుస ఉగ్ర దాడులతో ఉలిక్కిపడింది. ఉగ్ర సాయుధ మూక బుధవారం ఏకకాలంలో మూడుచోట్ల దాడులకు దిగింది. దేశ రాజధాని టెహ్రాన్‌లోని పార్లమెంటు భవనంలోనూ, కోమెనీ ప్రార్థనస్థలంలోనూ, మెట్రో స్టేషన్లోనూ ఉగ్రవాదులు సాయుధ ఉగ్రవాదులు దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఏకంగా పార్లమెంటు లోపల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పార్లమెంటు లోపల ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారు ఏ క్షణమైన బీభత్సానికి ఒడిగట్టవచ్చునని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పార్లమెంటు భవనంలో జరిగిన దాడిలో ముగ్గురు గాయపడినట్టు సమాచారం. పార్లమెంటులోపల సాయుధుల అదుపులో బందీగా పలువురు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టెహ్రాన్‌లోని ప్రఖ్యాత విప్లవకారుడు రుహోల్లా ఖోమీనీ ప్రార్థనం స్థలం వద్ద భక్తులు లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ జరిగిన ప్రాణనష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.