దారి తప్పిన గ్రహశకలం

Interstellar Asteroid Looks Like a Spinning Space Cigar - Sakshi - Sakshi

వేరే నక్షత్ర సమూహం నుంచి సౌర కుటుంబంలోకి రాక..

సూర్యుడికి అతి దగ్గరగా పయనం

లండన్‌: మన సౌర కుటుంబం మీదుగా ఎర్రటి, పొడవాటి ఓ వస్తువు గతనెలలో దూసుకు పోయింది. అన్ని గ్రహశకలాల మాదిరిగానే ఇది కూడా సాధారణమైందని ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. అయితే అది వేరే నక్షత్ర సమూహం నుంచి వచ్చిన తొలి గ్రహశకలం అని వారి పరిశీలనలో తెలిసింది. గత నెలలో ఆకాశంలో ఏదో వస్తువు వెలుగుతూ వెళ్లినట్లు హవాయిలోని పాన్‌–స్టార్స్‌1 అనే టెలిస్కోప్‌ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.

తొలుత చిన్న పరిమాణంలో ఉండే సాధారణ గ్రహశకలం అని భావించినా.. ఆ తర్వాత దాని కచ్చితమైన కక్ష్యను గుర్తించగలిగారు. ఈ వస్తువు వేరే నక్షత్ర మండలం నుంచే వచ్చినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తొలుత ఆ వస్తువును తోకచుక్కగా భావించారు. అయితే సెప్టెంబర్‌లో తోకచుక్క వంటివేవీ సూర్యుడికి దగ్గరగా వెళ్లినట్లుగా ఎలాంటి గుర్తులు కనిపెట్టలేకపోయారు.

దీంతో ఆ తర్వాత ఆ వస్తువును వేరే నక్షత్ర మండలానికి చెందిన గ్రహశకలమని గుర్తించారు. దానికి ‘ఔమువామువా’అని పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 400 మీటర్ల పొడవుతో.. వెడల్పుతో పోల్చుకుంటే 10 రెట్ల పొడవుతో ఉంది. ఔమువామువా ఇప్పటికే సూర్యుడికి అతి దగ్గరి నుంచి వెళ్లిందని, అక్కడి నుంచి మన సౌర కుటుంబం దాటి వేరే నక్షత్ర మండలానికి వెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు చెప్పారు.

భూమిని ఢీకొననున్న అపోఫిస్‌!
కాలిఫోర్నియా: ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్‌ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది.

దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్‌ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్‌ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్‌ 13 మన భూ గ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2029లో కూడా అపోఫిస్‌ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top