
న్యూయార్క్ : అణుబాంబు పరీక్షలతో ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న ఉత్తర కొరియాతో వ్యాపార లావాదేవీలను ఐక్యరాజ్య సమితి నిషేధిస్తూ చేసిన ఒప్పందంపై భారత్ 2017లో సంతకం చేసింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. భారత్, ఉత్తర కొరియా నుంచి 2.2 మిలియన్ డాలర్ల దిగుమతులను, 5,78,000 డాలర్ల ఎగుమతులను జరిపిందంట్టు ఐక్యరాజ్య సమితి ప్యానెల్ తెలిపింది. భారత్ తన సొంత ఆదేశాలను కూడా పాటించట్లేదని ఆరోపించింది. ఉత్తర కొరియాతో ఎలాంటి వ్యాపార సంబంధాలను పెట్టుకోకుడదని భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కానీ భారత్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఉత్తర కొరియాతో వ్యాపార లావాదేవీలు జరిపినట్టు ఐరాస ప్యానెల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2017 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తంగా 1.4 మిలియన్ డాలర్ల స్టీల్‌ను, 2,34,000 డాలర్ల విలువ గల ఇనుము, 2,33,000 డాలర్ల విలువ గల కాపర్, 5,26,000 డాలర్ల విలువ గల జింక్‌ను దిగుమతి చేసుకున్నట్టు నివేదికలో తెలిపింది. అలాగే 2017 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారత్, ఉత్తర కొరియాకు 5,78,994 డాలర్ల విలువ గల జ్యూలరీని ఎగుమతి చేసినట్టు అందులో పేర్కొంది.