కార్పొరేట్‌ పన్ను తక్కువుండే దేశాలివే | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ పన్ను తక్కువుండే దేశాలివే

Published Wed, Dec 14 2016 6:50 PM

కార్పొరేట్‌ పన్ను తక్కువుండే దేశాలివే

లండన్‌: ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ కార్పొరేట్‌ కంపెనీలను ఆహ్వానించేందుకు పలు దేశాలు అతి తక్కువ పన్నులను విధించడం లేదా పలు పన్ను రాయితీలు కల్పించడం చేస్తున్న విషయం తెల్సిందే. ఏ దేశంలో అతి తక్కువగా కార్పొరేట్‌  పన్నులు ఉన్నాయి? ఏ దేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు పన్నుల భారాన్ని తప్పించుకునేందుకు ఓ చోట సంపాదించిన ఆదాయాన్ని పన్ను రాయతీలున్న మరో చోట చూపిస్తున్నాయో అధ్యయనం జరిపి ‘ఆక్స్‌ఫామ్‌’ అనే అంతర్జాతీయ చారిటీ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది.
అసలు పన్నులు లేని దేశాల నుంచి అతి తక్కువ పన్నులున్న దేశాల జాబితాలో మొదటి రెండు స్థానాలను బెర్ముడా, కేమన్‌ ఐలాండ్స్‌ ఆక్రమించాయి.

ఎందుకంటే ఈ రెండు దేశాల్లో కార్పొరేట్‌ ఆదాయంపై పన్ను అసలు లేదు. ఆ తర్వాత నెదర్లాండ్స్, స్విడ్జర్లాండ్, సింగపూర్, ఐర్లాండ్, లగ్జమ్‌బర్గ్, కురకావో, హాంకాంగ్, సైప్రస్, బహమాస్, జెర్సీ, బార్బడోస్, మార్శష్, బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ దేశాలున్నాయి. బెర్ముడా, కేమన్‌ ఐలాండ్స్‌తోపాటు జెర్సీ, వర్జిన్‌ ఐలాండ్స్‌ దేశాలు బ్రిటిష్‌ సార్వభౌమాధికారం కిందనే ఉన్న విషయం తెల్సిందే.
నెదర్లాండ్స్, లగ్జమ్‌బర్గ్, సింగపూర్, స్విడ్జర్లాండ్, హాంకాంగ్‌ లాంటి దేశాల్లో కార్పొరేట్‌ కంపెనీలు పన్నులు చెల్లించే సామర్థ్యంకన్నా అతి తక్కువగా పన్నులు ఉన్నాయి. ప్రపంచంలోని  అతి పెద్ద అంతర్జాతీయ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు పన్నుకు స్వర్గధామమైన దేశంలో తప్పనిసరిగా ఓ బ్రాంచ్‌ కంపెనీ ఉంటోంది. అంటే వేరే దేశాల్లో వచ్చిన ఆదాయాన్ని పన్ను తక్కువగా ఉన్న దేశాల్లో అవి చూపిస్తున్నాయి.

గత పదేళ్లలో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం పెరుగుతున్నప్పటికీ అవి చెల్లిస్తున్న పన్నుల శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. పదేళ్ల క్రితం కార్పొరేట్‌ ఆదాయం పన్ను సరాసరి సగటున 27.5 శాతం ఉండగా, అది ఇప్పుడు 23.6 శాతానికి చేరుకొంది. గత 30 ఏళ్ల కాలంలో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం మూడింతలు పెరిగింది. 1980లో కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం రెండు లక్షల కోట్ల డాలర్లుకాగా, 2013 నాటికి. 7.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని 360 కోట్ల మంది ప్రజల వద్ద ఎంత సొమ్ము ఉందో, కేవలం 62 మంది వ్యాపార దిగ్గజాల వద్ద అంత సొమ్ము ఉందని ఆక్స్‌ఫామ్‌ అధ్యయనంలో వెల్లడైంది. కార్పొరేట్‌ పన్నుల వ్యవస్థ, కంపెనీల ఆదాయ వివరాల వెల్లడి పారదర్శకంగా లేకపోవడ వల్ల ప్రజల ఆర్థిక వనరుల మధ్య రోజురోజుకు వ్యత్యాసం పెరుగుతోందని ఆక్స్‌ఫామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement