సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి | Sakshi
Sakshi News home page

సెజ్‌లోని ఐటీ కంపెనీలపై..పన్ను తగ్గించండి

Published Tue, Dec 17 2019 3:09 AM

IT industry seeks 15 Persant corporate tax rate for services - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) నుంచి పనిచేసే ఐటీ కంపెనీలపై 15 శాతమే కార్పొరేట్‌ పన్ను విధించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమ డిమాండ్‌ చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020–21 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్న దృష్ట్యా... దీనికోసం సోమవారం నుంచి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), స్టార్టప్‌లు, మొబైల్‌ తయారీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన ప్రతినిధులు మంత్రి ముందు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు.

ఐటీ పరిశ్రమ..  
‘‘కొత్తగా ఏర్పడే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను రేటును 15 శాతానికి తగ్గించారు. సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త సేవల కంపెనీలకూ 15 శాతం రేటు అమలు చేస్తే సెజ్‌లలోని తయారీ, సేవల రంగాలకు ఒకటే రేటు అమలవుతుందని కేంద్రానికి సూచించాం’’ అని నాస్కామ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ అగర్వాల్‌ చెప్పారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల విషయంలో సెజ్‌లు భవిష్యత్తు వృద్ధికి కీలకమన్నారు. విస్తృతమైన టెక్నాలజీలపై (డీప్‌టెక్‌) పనిచేసే స్టార్టప్‌ల కోసం నిధితోపాటు, ఆవిష్కరణల సమూహాలను ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. దేశంలో డేటా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించినట్టు రిలయన్స్‌ జియో వైస్‌ ప్రెసిడెంట్‌ విశాఖ సైగల్‌ తెలిపారు.

ఆర్థిక సేవల సంస్థలు..
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ విస్తరణ కోసం జీఎస్‌టీ రేటును తగ్గించాలని, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి కేవైసీ నిబంధనలను క్రమబద్ధీకరించాలని ఫైనాన్షియల్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ రంగానికి చెందిన కంపెనీలు (బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు) ప్రభుత్వానికి సూచించాయి. ప్రభ్వురంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపరచడంపై, పీజే నాయక్‌ కమిటీ సిఫారసుల అమలుపై దృష్టి సారించాలని కోరాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఒత్తిళ్లను తొలగించి, నిర్వహణను మెరుగుపరిచే విషయమై కూడా సూచనలు చేశాయి. ఆర్థిక పరిమితులకు లోబడి వీటిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. ‘‘ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై పన్ను మినహాయింపును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని సూచించాయి. అటల్‌ పెన్షన్‌ యోజనలో ప్రవేశానికి గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు చేయాలని కూడా కోరాం’’ అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.  

మొబైల్‌ పరిశ్రమ...
ఇటీవల ప్రభుత్వం ఎగుమతులపై తగ్గించిన రాయితీలతో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, అలాగే, మొబైల్‌ హ్యాండ్‌సెట్లపై జీఎస్‌టీ రేటు తగ్గించాలని కోరింది. దేశంలో పెద్ద ఎత్తున తయారీకి ఇది అవసరమని పేర్కొంది. ఎగుమతులపై 8% రాయితీ ఇవ్వాలని కోరింది.

జీఎస్‌టీ పరిహార చెల్లింపులకు కట్టుబడి ఉన్నాం
ముంబై: జీఎస్‌టీ పరిహార చెల్లింపులపై కేంద్రం తన హామీని విస్మరించబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి భరోసానిచ్చారు. వసూళ్లు తగ్గినందునే పరిహార చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. పరిహారాన్ని వెంటనే కేంద్రం చెల్లించాలంటూ కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఇలా స్పందించారు. ‘‘ఇది వారి హక్కు. నేను తోసిపుచ్చడం లేదు. దీన్ని నిలబెట్టుకోకపోవడం ఉండదని స్పష్టం చేయదలుచుకున్నాను’’ అని వివరించారు. ముంబైలో సోమవారం జరిగిన టైమ్స్‌ నెట్‌వర్క్‌ ‘భారత ఆర్థిక సదస్సు’ను ఉద్దేశించి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  డేటా (సమాచారం) విశ్వసనీయతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.  

రాష్ట్రాలకు రూ.35,298 కోట్ల పరిహారం
కీలకమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ ఈ నెల 18న జరగనుండగా, రెండు రోజుల ముందు సోమవారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.35,298 కోట్లను జీఎస్‌టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. సకాలంలో పరిహార చెల్లింపులను కేంద్రం విడుదల చేయకపోవడంతో  పలు రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Advertisement
Advertisement