
వాషింగ్టన్ : ‘ఉత్తరకొరియా’ ఈ పేరు తలుచుకుంటేనే ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. అందుకు కారణం ఆ దేశ నాయకుడు. దేశాన్ని పేదరికం, ఆకలి చావులు నలిపేస్తున్నా.. ఉన్నదాంట్లోనే ప్రపంచదేశాలను తలదన్నే సాంకేతికతను సాధించిందా దేశం. సైబర్ వార్‌లో ఉత్తరకొరియా పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేటు వ్యాపార దిగ్గజాలను కూడా వణికిస్తోంది.
అయితే, ఉత్తరకొరియాను సైబర్‌వార్‌లో బలీయమైన శక్తిగా నిలబెడుతోంది భారతీయులని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. భారత హ్యాకర్ల సాయంతో పశ్చిమ దేశాలపై కిమ్ దేశం దాడులు చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో పెద్ద మొత్తం భారత్, విదేశీ భూభాగాల నుంచి జరుగుతున్నాయని, అతి కొద్ది మొత్తంలో మాత్రమే ఉత్తరకొరియా భూభాగం నుంచి జరుగుతున్నట్లు వెల్లడించింది.
కంప్యూటర్లంటే తెలియని వాళ్లు..
కంప్యూటర్లను ఉత్తరకొరియా వినియోగిస్తుందా? అనే హాస్యాస్పద దూషణల నుంచి కంప్యూటర్లతో ప్రపంచ దేశాలను గడగడలాడించే స్థాయికి ఉత్తరకొరియా చేరింది. అందుకు కారణం కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జొంగ్ ఇల్. ఆయన పరిపాలిస్తున్న సమయంలో కంప్యూటర్లు అంతంతమాత్రంగానే ఉండేవి. 1990ల్లో కంప్యూటర్ల ఆవశ్యకతను, భవిష్యత్తులో అవి కీలక పాత్ర వహించనున్నాయని గుర్తించిన ఇల్.. గూఢచర్యం కోసం కొంతమందికి శిక్షణ ఇప్పించారు. మెల్లగా సైబర్ నిపుణుల అవసరం ఆయనకు అర్థమైంది. దాంతో సైబర్ ఆర్మీని సృష్టించారు. ఇల్ మరణానంతరం పగ్గాలు చేపట్టిన కిమ్.. సైబర్ దళాన్ని భారీగా పెంచేశారు.
సోని పిక్చర్స్‌కు షాక్
కిమ్ జాంగ్ ఉన్‌ను హత్య చేస్తున్నట్లు సోని పిక్చర్స్ నిర్మించిన ఓ కామెడీ చిత్రాన్ని 2014లో ఉత్తరకొరియా సైబర్ నిపుణులు హ్యాక్ చేశారు. ఆ దెబ్బకు సోని ఆ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాల్సివచ్చింది.
శత్రువుకు అందని తెలివి..
అత్యాధునిక హార్డ్‌వేర్లతో ప్రపంచదేశాలు ముందుకు పోతుంటే ఉత్తరకొరియా మాత్రం పాతకాలపు టెక్నాలజీనే వాడుతోంది. అందుకే అగ్రరాజ్యమైన అమెరికా, దాని భాగస్వామి దక్షిణ కొరియాలు ఆ దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. ఉత్తరకొరియా అణు ఆయుధాలు, క్షిపణుల సాఫ్ట్‌వేర్లను హ్యాక్ చేయడం అమెరికాకు సవాలుగా మారింది.
భారత్ నుంచి ఇలా..
ఉత్తరకొరియా చేస్తున్న సైబర్ దాడుల్లో ఐదో వంతు భారత భూభాగం నుంచే జరుగుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ‘రికార్డెడ్ ఫ్యూచర్’ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెప్పింది. ఉత్తరకొరియాకు చెందిన సైబర్ బృందాలు భారత్‌లో పనిచేస్తున్నాయని తెలిపింది. భారత్-ఉత్తరకొరియాల మధ్య పలు అంశాల్లో దౌత్య పరమైన సంబంధాలు ఉన్నాయి.
‘భారత్‌లోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ఉత్తర కొరియా విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ, పరిశోధనా విభాగాల్లో కూడా వారు పనిచేస్తున్నారు. భారత్‌లోని కీలక సంస్థలపై కూడా వారు దాడులు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇండియన్ నేషనల్ మెటలార్జికల్ లేబరేటరీలను ఈ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయంలో భారత్‌కు ఎటువంటి దురుద్దేశాలు ఉండకపోవచ్చు’ అని రికార్డెడ్ ఫ్యూచర్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.