హెచ్‌1బీల శ్రమ దోచేస్తున్నారు

H-1B Visa Holders Underpaid, Vulnerable To Abuse - Sakshi

అమెరికాలో ఓ అధ్యయనంలో వెల్లడి

అమెరికాలో హెచ్‌1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్నవారు దోపిడీకి గురవుతున్నారని, వేధింపుల్ని ఎదుర్కొంటున్నారని ‘సౌత్‌ ఆసియా సెంటర్‌ ఫర్‌ ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌’ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. వారికి శ్రమకు తగిన వేతనం లభించడం లేదని, పని ప్రదేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఆ సంస్థ వెల్లడించింది. ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల దేశానికే ఎక్కువ నష్టమని హెచ్చరించింది.

హెచ్‌1బీ వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేలా వీసా విధానంలో సంస్కరణలు చేస్తామని, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ అధ్యయనం చేసింది. హెచ్‌1బీ ఉద్యోగుల హక్కుల్ని కాపాడాలని, వారు పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచాలని ఆ సంస్థ తన నివేదికలో సూచించింది. వేతనాలు ఎక్కువగా ఇచ్చి ప్రతిభ కలిగిన విదేశీ ఉద్యోగుల్ని పనిలోకి తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడింది. ‘హెచ్‌1బీ ఉద్యోగులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తోంది.

వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. పని చేసే ప్రదేశాల్లోనూ దారుణమైన పరిస్థితులున్నాయి’ అని వివరించింది. ఈ పరిస్థితులను  మెరుగుపర్చేందుకు పలుసూచనలు చేసింది. మొదట చేయాల్సింది హెచ్‌1బీ ఉద్యోగుల వేతనాల పెంపు అని స్పష్టం చేసింది. అపుడే ట్రంప్‌ కోరుకుంటున్నట్లు నిపుణులైన ఉద్యోగులు వస్తారని తెలిపింది. నైపుణ్యం కలిగిన అమెరికన్లనూ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, అర్హతల్ని బట్టి వారిని అత్యున్నత పదవుల్లో నియమించాలని పేర్కొంది. ఇక ఉద్యోగుల భర్తీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించింది. హెచ్‌1బీ వీసాల జారీలో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, లాటరీ ద్వారా వారిని ఎంపిక చేయడం వంటి విధానాలకు స్వస్తి పలికి, నైపుణ్యం ఆధారంగానే వీసాలివ్వాలని సూచనలు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top