
పక్కింటి కాంతం ఉంది చూశావూ.. వాళ్లాయనకు ఎవరితోనో లింకు ఉందటే.. నీకెలా తెలుసు అక్కాయ్.. ఎవరో చెబితే.. నేనెందుకు నమ్ముతానే.. ఎవరికి చెప్పొద్దని కాంతమే నాకు చెప్పిందే..
సినిమాల్లో చూపించినట్లు ఇలాంటి చెవులు కొరుక్కోవడాలు మహిళలకే పరిమితమని అనుకుంటూ ఉంటాం.. కానీ మగాళ్లూ ఇందులో ఏమాత్రం తీసిపోవడం లేదని ఓ అధ్యయనం తాజాగా తేల్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఏరియల్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని చేసింది. ఇందుకోసం 2,200 మంది ఉద్యోగులను.. వారి గాసిప్ అలవాట్లు తదితరాలపై ప్రశ్నించింది. దీంతోపాటు వారు ఇటీవల కలుసుకున్న ఓ వ్యక్తి గురించి అభిప్రాయాన్ని తెలపమని కోరింది. అనంతరం ఫలితాలను విశ్లేషించగా.. మహిళలతో సమానంగా మగాళ్లు కూడా ఆఫీసుల్లో చెవులు కొరుక్కుంటున్నారట.
అయితే.. ఈ గుసగుసల్లో భాగంగా మహిళా ఉద్యోగులు తమ సహచరుల గురించి మాట్లాడేటప్పుడు సానుకూలంగా మాట్లాడితే.. పురుషులు మాత్రం ఆఫీసుల్లో తమ ప్రత్యర్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా గాసిపింగ్ చేస్తున్నారు. ‘స్త్రీలే ఎక్కువగా గ్యాసిప్‌లు వంటివి చెప్పుకుంటారన్న సాధారణ అభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు మా అధ్యయనంలో వచ్చాయి. పైగా మగాళ్లతో పోలిస్తే.. గుసగుసల విషయంలో మహిళలు చాలా మంచిగా మాట్లాడతారు కూడా’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన బెన్ హాడర్ పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ జెండర్ స్టడీస్’లో ప్రచురితమయ్యాయి.
– సాక్షి, తెలంగాణ డెస్క్