ఆయన అలాంటి వాడు కాదట..?!

Girlfriend Of Paddock : No Warning About Massacre - Sakshi

రక్తపాతం గురించి నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు

నరమేధం గురించి నాతో మాటమాత్రంగా చెప్పలేదు

పెడాక్‌ మానవత్వమున్న మనిషి : ప్రియురాలు డాన్లీ

వాషింగ్టన్‌: లాస్‌వేగాస్‌లో నరమేధానికి దిగిన.. స్టీఫెన్‌ పెడాక్‌ గురించి అతని గర్ల్‌ఫ్రెండ్‌ మార్లు డాన్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నరమేధం జరుగుతున్న సమయంలో పిలిప్పీన్స్‌లో ఉన్న ఆమె.. అమెరికాకు తిరిగి రావడంతో ఎఫ్‌బీఐ అధికారులు విచారణకు దిగారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెడాక్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘అతను చాలా మంచివాడు.. మానవత్వం ఉన్న మనిషి, జాలి, దయ వంటి గుణాలు ఉండడమే కాక ఎవరితోనూ విభేధాలు, గొడవలు పడని వ్యక్తి’ అని చెప్పారు. అంతేకాక తనతో పొరపాటున కూడా.. ఇటువంటి రక్తపాతానికి దిగుతున్నట్లు కానీ,  హింసాత్మక ఘటన చేస్తున్నట్లుకానీ మాట మాత్రంగానైనా చెప్పలేదని ఆమె అన్నారు.

ఈ నరమేధం గురించి ఏ మాత్రం తెలిసున్నా.. ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునేదాన్ని అని డాన్లీ చెప్పారు. భయంకర విధ్వంసం జరిగిపోయింది.. ఇప్పుడు చేయడానికి ఎవరి దగ్గర ఏం లేదు.. అని ఒకరకమైన నిర్వేదంతో ఆమె చెప్పారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని.. గాయాలతో చికిత్స పొందుతున్నవారు.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు డాన్లీ తెలిపారు. నరమేధంపై విచారణ చేస్తున్న అధికారులకు పూర్తిగా సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు.

 నరమేధం సృష్టించేందుకు పెడాక్‌కు ఎవరైనా ప్రేరణ కల్పించారా? లేక రక్తపాతం సృష్టించాలన్న ఆలోచనల పెడాక్‌లో ఎలా వచ్చింది? ఇందుకు నీ దగ్గర ఏదన్నా సమాచారం ఉందా? అని డాన్లీని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించారు. దానికి స్పందించిన డాన్లీ.. పై విధంగా సమాధానాలు ఇచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న అధికారులు మాత్రం పెడాక్‌కు సంబందించిన మూలాలను, నరమేధానికి గల కారణాలను తెలుసుకుంటామని చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top