అక్కడ సింహాలతో ఆడుకోవచ్చు!

Gaza Zoo Allow Visitors To Play With Lion Which Is Declawed - Sakshi

గాజా, పాలస్తీనా : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న పాలస్తీనియన్‌ రాజ్యం గాజాలోని పార్కులు సందర్శకులకు వినూత్న అనుభవం కలిగిస్తున్నాయి. ఏకంగా సింహాలతో ఆడుకునే వెసలుబాటు కల్పించి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫాలో ఉన్న ఓ జూ పార్కులో ‘ఫెలెస్టీన్‌’ అనే ఆడ సింహాన్ని జూ నిర్వాహకులు సమీపంలో ఉన్న ఇళ్లకు తీసుకువెళ్లి ఆడిస్తుండటం విశేషం. ఈ విషయం గురించి జూ యజమాని మహ్మద్‌ జుమ్మా మాట్లాడుతూ... ‘ సింహంలో ఉన్న క్రూరత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా. అందుకే దాని గోళ్లు కత్తిరిస్తున్నాం. సందర్శకులతో తను స్నేహంగా ఉంటోంది’  అంటూ చెప్పుకొచ్చాడు.

పిల్లలు కూడా ఆడుకున్నారు...
ఫెలెస్టీన్‌ను మంగళవారం షికారుకు తీసుకువెళ్లినట్లు దాని శిక్షకుడు ఫయీజ్‌ అల్‌- హదద్‌ వెల్లడించారు. ‘ కొన్ని రోజులుగా ఫెలెస్టీన్‌ మానసిక స్థితిని అంచనా వేశాను. అందుకే సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌కి తీసుకు వెళ్లాను. అక్కడ ఉన్న వారంతా పిల్లలతో సహా ఫెలెస్టీన్‌తో ఆడుకున్నారు. దాని గోళ్లు కత్తిరించాం కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే పళ్లు మాత్రం అలాగే ఉంచుతాం. కాబట్టి దాని సహజత్వాన్ని కోల్పోదు. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తాం’ అని పేర్కొన్నాడు.

కాగా శిథిలావస్థకు చేరిన జూ పార్కులను పునరుద్ధరించేందుకు.. జంతువులతో ఆడుకోవడం వంటి వెసలుబాటు కల్పిస్తున్న యజమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారం కోసం జంతువుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని.. అదేవిధంగా జంతువులను బయట తిప్పడం వల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరంతరం బాంబుల మోతతో దద్దరిల్లే గాజాలో పిల్లల ముఖాల్లో కాస్త సంతోషం చూసేందుకే ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నామని జూ నిర్వాహకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top