పాక్‌ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్‌

Former Pakistan President Asif Ali Zardari arrest - Sakshi

మనీలాండరింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్న ఎన్‌ఏబీ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ(63) అరెస్టయ్యారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆయన్ను నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) బృందం సోమవారం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఆయన అరెస్ట్‌అయ్యారు. కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఎన్‌ఏబీ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచుతారని సమాచారం. ఈ కేసులో జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్‌ తల్పూర్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు.

అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి. అధికారులు తల్పూర్‌ను అరెస్ట్‌ చేయలేదు. జర్దారీ అరెస్టుపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాక్‌  ప్రధానిగా బేనజిర్‌ భుట్టో 1988–90, 1993–96 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008–13 సంవత్సరాల మధ్య పనిచేశారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం అరెస్టు చేసిందని, నకిలీ బ్యాంకు అకౌంట్లతో తనకు సంబంధంలేదని జర్దారీ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top