
సాక్షి, న్యూఢిల్లీ : ఇజ్రాయిల్ సైనికులు ఓ పక్క దట్టమైన పొగ వెలువడేలా టైర్లను కాలుస్తూ మరో పక్క భాష్ప వాయువు గోళాలను ప్రయోగిస్తున్నా పాలస్తీనా నిరసనకారులు తమ ‘దబ్కే’ డ్యాన్స్‌ను ఆపలేదు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పటి పాలస్తీనా ప్రజా నాయకుడు యాసర్ అరాఫత్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన తరహాలోనే ముఖానికి ‘కెఫియే’ (తల మీదుగా నోటిని, ముక్కును చుడుతూ పాగా కట్టుకోవడం. భాష్ప వాయువు ప్రభావాన్ని తప్పించుకునేందుకే అరాఫత్ అలా కట్టుకునేవారట)ను కట్టుకొని చేతుల్లో చిన్న తాడును తిప్పుతూ ఆరుగురు మగవాళ్లు ‘దబ్కే’ డ్యాన్స్ చేస్తుంటే వారికి ఓ యువతి నాయకత్వం వహించిన వీడియో ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇజ్రాయెల్‌లోని తమ సొంత గూటికి చేరే హక్కును పాలస్తీనీయన్లకు కల్పించాలనే డిమాండ్‌తో పాలస్తీనా ఆందోళనకారులు ‘గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్’ పేరుతో గత మార్చి 30వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ నిరసనకు మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ శుక్రవారం నాడు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఈ ‘దబ్కే’ నత్యాన్ని ప్రదర్శించారు. దబ్కే అనేది అరబ్బుల సంప్రదాయ నత్యం. వేడుకల సందర్భంగా, ముఖ్యంగా పెళ్లిళ్లలో అరబ్బులు ఈ నత్యం చేస్తారు. పాలస్తీనా ఆందోళనకారులు ఈ మూడు నెలల నిరసన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి హింసకు పాల్పడకుండా వినూత్నంగానే నిరసన తెలిపారు.
ఇజ్రాయెల్ సైనికులు ప్రయోగించిన భాష్ప వాయువు గోళాలను సేకరించి వాటిలో టెన్నీస్ రాకెట్లు పెట్టి విసరారు. కొన్ని రోజులు సరిహద్దుల్లో బుద్ధిగా కూర్చొని వలసవాద వ్యతిరేక పుస్తకాలను చదివారు. అవతార్ సినిమాల్లోని పాత్రల్లా ప్రత్యక్షమై వినోదాత్మకంగా నిరసన వ్యక్తం చేశారు. అయినా ఈ మూడు నెలల కాలంలో ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 131 మంది పాలస్తీనా నిరసనకారులు చనిపోవడం, 14 వేల మంది గాయపడడం విచారకరం.