సొరంగంలో సవారీ...!

Elon Musk Boring Tunnel Will Start Soon - Sakshi

భవిష్యత్‌ నగర రవాణా వ్యవస్థను మార్చనున్న ఎలన్‌ మస్క్‌ ఆలోచన

డిసెంబర్‌ 10న అమెరికాలో అట్టహాసంగా ఆవిష్కరణ

డిసెంబర్‌ 10.. ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. నగర రవాణా వ్యవస్థను మార్చే ఓ అద్భుతమైన ప్రాజెక్టును ఆ రోజున ఆవిష్కరిస్తానని అమెరికన్‌ వ్యాపారవేత్త, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ మాట ఇచ్చాడు. అంతేకాదు దీని వల్ల తక్కువ సమయంలో.. అతి తక్కువ ఖర్చుతో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణాన్ని సాగించవచ్చని తెలిపాడు. మస్క్‌ ఆధ్వర్యంలోని బోరింగ్‌ కంపెనీ రూపొందించిన ఈ ప్రాజెక్టు పేరే ‘బోరింగ్‌ టన్నెల్‌’. ఇంతకీ ఆ ప్రాజెక్టు విజయవంతం అవుతుందా? లేదా? అని ప్రపంచమే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రాజెక్టు గనుక విజయవంతమైతే ట్రాఫిక్‌ కష్టాలు తప్పడంతోపాటు భవిష్యత్తు నగర రవాణా వ్యవస్థనే సమూలంగా మార్చేస్తుందని భావిస్తోంది.

ప్రాజెక్టులో ముఖ్యమైనవి..

  1. స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌
  2. ఎలక్ట్రిక్‌ స్కేట్స్‌
  3. సొరంగంలో ఏర్పాటు చేసిన పట్టాలు

పనితీరు ఇలా..
సొరంగ మార్గంలోకి ప్రవేశించడానికి స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డుపై ఫుట్‌పాత్‌కు పక్కనే ఉంటాయి. వాహనాలు ముందుగా స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేసిన ‘ఎలక్ట్రిక్‌ స్కేట్స్‌’మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్కేట్స్‌ ఎలివేటర్‌ మాదిరిగా పని చేస్తాయి. ఈ స్కేట్స్‌ వాహనాలను భూమిలోనికి తీసుకెళుతూ.. సొరంగ మార్గంలోని పట్టాల మీదకు వెళ్లి కూర్చుంటాయి. అనంతరం ఈ స్కేట్స్‌ పట్టాల మీద అత్యధిక వేగంతో ముందుకు కదులుతూ గమ్యస్థానానికి చేరుకుంటాయి. అక్కడ నుంచి ఈ స్కేట్స్‌ పట్టాల నుంచి విడిపోయి పక్కకు జరిగి ఎలివేటర్‌ సహాయంతో పైకి కదులుతూ.. స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌ మీదకు చేరుకుంటాయి.

తొలి ప్రయోగానికి సిద్ధం..
బోరింగ్‌ కంపెనీ ఇప్పటికే రెండు మైళ్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని సిద్ధం చేసింది. లాస్‌ ఏంజిలెస్‌లోని టెస్లా (ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ) ప్రధాన కేంద్రం నుంచి లాస్‌ ఏంజిలెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించింది. దీన్ని ఉపయోగించుకోవడానికి కేవలం ఒక అమెరికన్‌ డాలర్‌ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ మారాన్ని డిసెంబర్‌లో ప్రపంచం ముందుకు మస్క్‌ తీసుకురానున్నారు. ఇది విజయవంతమైతే అమెరికాలో మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉంది.

స్కేట్స్‌ స్పెషాలిటీ..

  •      స్కేట్స్‌పైన వాహనాలు ఉన్న సమయంలో వీటి వేగం గంటకు సుమారు 240 కిలోమీటర్లు.
  •     టెస్లా మోడల్‌ ఎక్స్‌ చాసీస్‌ను మార్పులు చేసి ఈ స్కేట్స్‌ను తయారు చేశారు.  
  •     ఇవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఉద్గారాల శాతం సున్నా కావడం గమనార్హం.
  •    ఒక స్కేట్‌ ఒకేసారి ఓ వాహనం లేదా 8 నుంచి 16 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు.
  •     ఇప్పుడున్న ప్రయాణ సమయం కంటే 14 రెట్లు వేగంగా.. ప్రస్తుత ఖర్చుతో పొలిస్తే దీని ఖర్చు 90 శాతం తక్కువ కావడం విశేషం.

మరో మూడు మార్గాలివే..

డగవుట్‌ లూప్‌
లాస్‌ ఏంజిలెస్‌లోని డాడ్జర్‌ బేస్‌బాల్‌ స్టేడియం నుంచి పలు మెట్రో స్టేషన్లకు తీసుకెళ్లేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇంకా దీనికి అనుమతులు లభించలేదు.

షికాగో ఎక్స్‌ప్రెస్‌ లూప్‌
ఓ హేర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లేక్‌ మిచిగాన్‌ ఒడ్డున ఉండే షికాగో ప్రాంతం వరకు ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గం పొడవు మొత్తం 27 కిలోమీటర్లు. సాధారణ ట్రాఫిక్‌లో అయితే ఈ దూరాన్ని చేరుకోవడానికి గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. అదే సొరంగ మార్గం ద్వారా కేవలం 12 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

ఈస్ట్‌ కోస్ట్‌ లూప్‌
ప్రాజెక్టు మొత్తంలో ఇదే అతిపెద్ద మార్గం అని చెప్పుకోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీని వాణిజ్య నగరం న్యూయార్క్‌కు కలిపేలా ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. అయితే మొదటి దశలో వాషింగ్టన్‌ డీసీ నుంచి మేరిలాండ్‌ మీదుగా బాల్టిమోర్‌లను కలిపేలా మార్గాన్ని రూపొందించనున్నారు.

టన్నెల్‌ కోసం టాప్‌ టెక్నాలజీ..
మస్క్‌ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు వాడిన సెకండ్‌ హ్యాండ్‌ బోరింగ్‌ మెషీన్‌ చాలా నెమ్మదిగా పనిచేసేది. ఎంత నెమ్మదిగా అంటే నత్త కంటే 10 రెట్లు తక్కువ వేగంతో భూమిని తవ్వేది. దీంతో లాభం లేదని భావించిన మస్క్‌ కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే బోరింగ్‌ మెషీన్లకు టెస్లా కార్ల బ్యాటరీలు కూడా వాడాలని మస్క్‌ భావిస్తున్నాడు. ప్రస్తుతం సొరంగం తవ్వడానికి అవుతున్న ఖర్చు ఒక మైలు దూరానికి సుమారు 600 మిలియన్ల డాలర్ల నుంచి 1 బిలయన్‌ డాలర్లు. దీనిని 60 మిలియన్‌ డాలర్లకు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చంతంటినీ ప్రైవేట్‌ కంపెనీలు ఫైనాన్స్‌ చేయనున్నట్లు తెలిపాడు. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న బోరింగ్‌ మెషీన్ల కంటే 14 రెట్లు వేగవంతమైన వాటిని తీసుకురానున్నట్లు మస్క్‌ ప్రకటించాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top