నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌

Donald Trump Nominated For Noble Peace Prize - Sakshi

జపాన్ ప్రధాని షింజో అబే సిఫారసు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆయన పేరును నోబెల్‌ కమిటీకి సిఫారసు చేసినట్లు ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్టు ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షింజో అబే తనకు ఐదే పేజీల ఉత్తరాన్ని కూడా రాసినట్లు చెప్పారు. 

జపాన్ ప్రజల తరఫున తనను ఈ పురస్కారానికి నామినేట్ చేశారని, తనకు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాల్సిందిగా నోబెల్ కమిటీని కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారని ట్రంప్ తెలిపారు. ఈ విషయమై షింజో అబేకి ధన్యవాదాలు తెలిపినట్టు ట్రంప్‌ ప్రకటించారు. జపాన్‌ ప్రధాని సిపారసుపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘గతంలో ఈ పురస్కారాన్ని బరాక్ ఒబామాకు ఇచ్చారు. ఆయనకు పురస్కారాన్ని ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రపంచ శాంతి కోసం నేను ఎంతో కృషి చేశాను. వేలాది మంది ప్రాణాలను కాపాడాను. సిరియాలో 30 లక్షల మంది ప్రజల ఊచకోతను ఆపాను. దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు.’’ అని అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top