
ట్రాక్టర్ నడిపిన కుక్క.. రైతు మృతి!
ఆయన యూకేలోని నార్త్ సోమర్‌సెట్‌లో ఓ బడా రైతు. గట్టిగా చెప్పాలంటే కోటీశ్వరుడు. కానీ, ఆయన తన పెంపుడు కుక్క చేతిలో చనిపోయాడు.
ఆయన యూకేలోని నార్త్ సోమర్‌సెట్‌లో ఓ బడా రైతు. గట్టిగా చెప్పాలంటే కోటీశ్వరుడు. కానీ, ఆయన తన పెంపుడు కుక్క చేతిలో చనిపోయాడు. ఆ కుక్క పొరపాటున ట్రాక్టర్ గేర్ వేయడంతో.. ఇంజన్ ఆన్‌లో ఉన్న ఆ ట్రాక్టర్ ముందుకు కదిలి ఆయన చనిపోయారు. ప్రముఖ పాడిరైతు, ప్రాపర్టీ డెవలపర్, స్థానిక కౌన్సిలర్ కూడా అయిన డెరెక్ మీడ్ ఈ ప్రమాదం కారణంగా కార్డియాక్ అరెస్ట్ సంభవించి అక్కడికక్కడే మరణించారు. బాగా ఎక్కువ లోడ్లను తీసుకెళ్లే జేసీబీ ఫాం లోడర్ అనే రకం ట్రాక్టర్ కింద పడి ఆయన నలిగిపోయినట్లు చెబుతున్నారు.
బహుశా అప్పటికే దాని ఇంజన్ ఆన్‌లో ఉండి ఉంటుందని, కుక్క పొరపాటున క్యాబిన్‌లోకి ప్రవేశించి, అనుకోకుండా గేర్ రాడ్ కదిలించి ఉంటుందని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే దగ్గరలో ఉన్నవాళ్లు పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో రెండు రెస్పాన్స్ వాహనాలు, ఒక అంబులెన్స్, ఒక ఎయిర్ అంబులెన్స్ అక్కడకు చేరుకుని, మీడ్‌ను కాపాడేందుకు ప్రయత్నించాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవారని, అలాగే పొలంలో పని చేయిస్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.