కోడిపెట్టకు డైపర్‌

Diapers to the Chicken - Sakshi

ఈ మధ్య అమెరికాలోని కోళ్లు డిక్కీలు ఊపుకుంటూ వయ్యారంగా తిరుగుతున్నాయట.. విషయమేంటని ఆరాతీస్తే.. హవ్వ అంటూ నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూశారుగా.. డిక్కీలకు డైపర్లు!! ఇక్కడైతే.. పిల్లలకు వేస్తాం.. అమెరికాలో వీటికి వేశారు... కనిపించినచోటల్లా రెట్టలతో ముగ్గులు పెట్టేయకుండా.. ఇలా కట్టడి చేశారన్నమాట. అక్కడి గ్రామీణప్రాంతాల్లో కోళ్లను పెంపుడు జంతువులుగా పెంచడం స్టేటస్‌ సింబల్‌గా మారిందట. దీంతో న్యూహాంప్‌షైర్‌కు చెందిన జూలీ బేకర్‌ బుర్రలో ఐడియా వచ్చింది. వెంటనే కోళ్లకు ఫ్యాషనబుల్‌గా కనిపించే డైపర్లు తయారుచేయడం ద్వారా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

కొన్నేళ్ల క్రితం యూ ట్యూబ్‌లో ఎవరో సరదాగా పెట్టిన కోడిపెట్టకు డైపర్‌ వేసిన వీడియోను ఆమె చూశారు. దీంతో నిజంగా మనమెందుకు ఇలా చేయకూడదు అనిపించిందట. పైగా.. తన కూతురు ఓ కోడిని పెంచుకుంటోంది. అది ఇంటిలో అక్కడక్కడా రెట్టలు వేయడం.. దాన్ని శుభ్రపరుచుకోవడానికి ఈవిడ తిప్పలు పడటం వంటివి గుర్తుకొచ్చాయి. దీంతో వాటికి డైపర్లు తయారు చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ‘పేంపర్డ్‌ పౌల్ట్రీ’పేరిట ఆన్‌లైన్‌లో విక్రయాలు మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా విక్రయాలు పెరిగాయి. నగరాల్లో ఉన్నవారు కూడా కొనడం మొదలుపెట్టారు. అన్ని ఖర్చులు పోనూ.. జూలీకి ఏటా రూ.40 లక్షల దాకా మిగులుతున్నాయట. డైపర్లు సక్సెస్‌ కావడంతో ఆమె కోళ్లకు డ్రస్సులు వంటి వాటి విక్రయాలు కూడా మొదలుపెట్టింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top