మరణం ముప్పును తగ్గించే పరుగు

Daily Running Cuts Risk of Early Death - Sakshi

వాషింగ్టన్‌: అనారోగ్య కారణాలతో మరణం దరి చేరకుండా ఉండాలంటే..రోజూ పరుగు తీయాల్సిందే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హృద్రోగులు, కేన్సర్‌ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్‌/జాగింగ్‌ చేస్తే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా వారికి ఆయా వ్యాధులతో మరణం వచ్చే అవకాశాలు 27 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ఐదున్నరేళ్ల నుంచి 35 ఏళ్లలోపు 2,32,149 మంది జీవనశైలి, దినచర్య, ఆరోగ్య నివేదికల పరిశీలన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. 

వ్యాయామానికి బాటలు వేస్తే వ్యాధులకు చెక్‌
దేశంలో మధుమేహం, కేన్సర్, హృద్రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే నగరాల్లో పర్యావరణ పరిరక్షణ,మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సూచించింది. కొరవడిన శారీరక వ్యాయామం, ముసురుకుంటున్న కాలుష్యం ప్రజలను వ్యాధిగ్రస్తుల్లా మారుస్తోందని తెలిపింది. దీంతో పడిపోతున్న ప్రజల ఆయుర్దాయాన్ని పెంచాలంటే నగరపాలక సంస్థలు ఇకనైనా మేల్కొనాలని కోరింది. రోడ్లపై పాదచారుల వంతెనలు, వాకింగ్‌/జాగింగ్‌ చేసేవారి కోసం రోడ్ల పక్కన కుర్చీలు, ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నివేదించింది.

వెన్నునొప్పి, నిద్రలేమికి యోగా, పీటీతో చెక్‌
 వెన్నునొప్పి, నిద్రలేమి సమస్యలకు యోగా, ఫిజికల్‌ థెరపీ (పీటీ) తో కళ్లెం వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యలకు వైద్యం తీసుకునే అవసరాన్ని కూడా యోగా, పీటీ తగ్గిస్తాయని అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి, నిద్రలేమి సమస్య ఉన్న 320 మందికి ఓ థెరపిస్టు దగ్గర 12 వారాల పాటు యోగా, పీటీ చేయించారు. అనంతరం వారిలో ఈ సమస్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి, వెన్నునొప్పి సమస్యలకు వాడే మందులతో దుష్ప్రభావం పడొచ్చని, దీంతోపాటు అతిగా మందులు వాడే ప్రమాదం ఏర్పడవచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవ్చని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top