చేసిన సాయం ఊరికే పోదు!

చేసిన పాపం ఊరికే పోదంటారు. ఎప్పటికైనా ఉసురు తీస్తుందని చెబుతారు. పాపమే కాదు.. ఆపద సమయాల్లో సాయం చేసినా కూడా ఎప్పటికైనా ఆ సాయం మనల్ని ఆదుకుంటుందని మరోమారు రుజువైంది. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి...

సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌: జేబు నిండా డబ్బున్నా అందులో నుంచి ఒక్కరూపాయి దానం చేయడం కోసం ఎంతగానో ఆలోచించేవారు మనలో చాలామందే ఉంటారు. అసలు దానం ఎందుకు చేయాలని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కానీ ఇటువంటివారికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన వ్యక్తి జానీ బాబ్బిట్‌. ఓ యువతి సమస్యలో ఉందని తెలియగానే ఆమె సాయం అడగకపోయినా తన వద్ద ఉన్నదంతా ఆమెకు ఇచ్చేశాడు. అలాగని జానీ గొప్ప ధనవంతుడేమీ కాదు. ఇంకా చెప్పాలంటే నిలువ నీడలేని బికారి. అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్న 20 డాలర్లనూ ఓ యువతికి సాయం చేసేందుకు ఖర్చుచేసేశాడు. ఆ సాయమే ఇప్పుడు అతణ్ని ఆదుకుంది. ఓ ‘ఇంటి’వాడిని చేసింది. అసలేం జరిగిందంటే...

కేట్‌ మెక్‌క్లురే అనే ఓ యువతి ఫిలడెల్ఫియాకు తన కారులో వేళ్తోంది. ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరిగ్గా అప్పుడే కారులో ఇంధనం అయిపోయింది. దీంతో ఏంచేయాలో తోచక అటూఇటూ చూస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన జానీ తన జేబులో ఉన్న 20 డాలర్లతో గ్యాస్‌ సిలిండర్‌ను నింపుకొని తెచ్చిచ్చాడు. అడగకుండానే సాయం చేసిన జానీకి ఏదైనా మేలు చేయాలని భావించింది కేట్‌. ఇంటికెళ్లగానే జానీకి సాయంగా గోఫండ్‌మి పేరుతో ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ మొదలుపెట్టింది. అతని దయనీయ స్థితిని వివరించింది. దీంతో స్పందించిన దాతలు ఏకంగా 2,52,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ సొమ్ముతో జానీకి ఇల్లు కొనిస్తానని, సుఖంగా బతికేందుకు మరిన్ని సదుపాయాలు సమకూరుస్తానని చెబుతోంది కేట్‌. నిజంగా గ్రేట్‌ కదూ..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top