లా‘డెన్‌’లో దాగిన రహస్యం

CIA releases vast Bin Laden archive seized in compound - Sakshi

వార్తా క్లిప్పింగులు, డాక్యుమెంటరీలు, నీలిచిత్రాలు...

కంప్యూటర్‌లో భద్రపరుచుకున్న అల్‌కాయిదా చీఫ్‌

వివరాలు బహిర్గతం చేసిన సీఐఏ  

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: కరడుగట్టిన ఉగ్రవాది, అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. పాకిస్తాన్‌లో అబోటాబాద్‌లోని రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి ఈ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్‌ అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఒక కంప్యూటర్‌లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు, లాడెన్‌ అరబిక్‌లో రాసుకున్న ఓ డైరీ ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియో వెల్లడించారు.  

కశ్మీర్‌ పరిణామాలపై ఆసక్తి...
అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్‌ ఫోన్, ఇంటర్నెట్‌లను వాడలేదు. అయినా అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌ పరిణామాలను లాడెన్‌ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడుల కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్‌ హెడ్లీ విచారణకు సంబంధించిన వార్తలను లాడెన్‌ క్రమం తప్పకుండా చదివేవాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్‌ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, అల్‌కాయిదా, తాలిబన్ల వార్తలను సేకరించేవాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ప్రచురించిన వార్తల క్లిప్పింగులనూ భద్రపరిచాడు.

ఇరాన్‌ను చిక్కుల్లో పెట్టేందుకేనా?
లాడెన్‌ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభ్యమయ్యాయి. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను లాడెన్‌ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్‌ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా అందులో ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్‌ ఇండియా’, కుంగ్‌ ఫూ కిల్లర్స్, వరల్డ్స్‌ వరస్ట్‌ వెనమ్‌... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. యానిమేటెడ్‌ చిత్రాలు, కార్టూన్‌ షోలతో పాటు టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి కార్టూన్‌ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, అల్‌కాయిదాలు అవగాహనకు వచ్చినట్లు ఓ ఫైల్‌లో ఉంది. ఇరాన్‌ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని చూపేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాసమాచారాన్ని విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top