వికీపీడియా ఇక చైనాలో బంద్‌..! | China Banned Wikipedia In All Languages | Sakshi
Sakshi News home page

వికీపీడియా ఇక చైనాలో బంద్‌..!

May 16 2019 5:16 PM | Updated on May 16 2019 5:24 PM

China Banned Wikipedia In All Languages - Sakshi

కమ్యునిటీ-ఎడిటెడ్‌ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాపై చైనా నిషేదం విధించింది.

బీజింగ్‌ : కమ్యునిటీ-ఎడిటెడ్‌ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాపై చైనా నిషేదం విధించింది. గతంలో వికీపీడియా చైనీస్‌ వెర్షన్‌ను మాత్రమే బ్యాన్‌ చేసిన ఆ దేశం తాజాగా అన్ని భాషల వికీపీడియా వెర్షన్లపై నిషేధం విధించింది. దాంతోపాటు దలైలామా, తియానమెన్‌ మసీద్‌ లాంటి సున్నితమైన అంశాలను సెర్చ్‌ చేయడంపట్ల కూడా ఆంక్షలు విధించింది. చైనా నిషేదంపై ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తెలిపింది. తమ దేశ సంస్కృతిని పరిరక్షించుకునే చర్యల్లో భాగంగా, అలాగే చైనాలోని ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్రభావాలకు లోనుకాకుండా అరికట్టేలా 'కల్చరల్ గ్రేట్ వాల్'ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ప్రజల ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసేలా స్వంత ఎన్‌సైక్లోపీడియా రూపొందించనున్నారని సమాచారం.

గూగుల్‌, ఫేస్‌బుక్‌, లింక్డ్‌ ఇన్‌పై చైనాలో ఇప్పటికే నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఎంతో కఠినమైన నియంత్రణలను బైపాస్ చేయగలిగే ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఉంటే తప్ప చైనాలో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను యాక్సెస్ చేయలేరు. కాగా, చైనా కఠిన నిబంధనల నేపథ్యంలో వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2019లో ఆ దేశం 177 ర్యాంకు పొందింది. 180 దేశాల జాబితాలో చైనా ఆ ర్యాంకు పొందడం అక్కడ భావప్రకటనా స్వేచ్ఛపై ఏ మేరకు ఆంక్షలు ఉన్నాయో స్పష్టమవుతోంది. 2015లో అమెరికా విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. అత్యంత కఠినమైన ఆన్‌లైన్ వినియోగ విధానాలు ఉన్న 65 దేశాల్లో చైనా కూడా ఒకటి.  ఇక టర్కీలో కూడా వికీపీడియాలో నేషేధం ఉండడం తెలిసిందే. చైనాలో ఇప్పటివరకు సుమారు 700 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. వికీపీడియా అంటే ఎవరైనా రాయదగిన ఒక స్వేచాó విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పు చేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement