బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం | Cell Phone Threats To Boeing Airplanes | Sakshi
Sakshi News home page

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

Jul 29 2019 1:08 AM | Updated on Jul 29 2019 9:11 AM

Cell Phone Threats To Boeing Airplanes - Sakshi

సెల్‌ఫోన్‌ కారణంగా విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) తెలిపింది. సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల కారణంగా బోయింగ్‌ కంపెనీకి చెందిన కొన్ని విమానాల్లోని కాప్‌పిట్‌లో ఉండే డిస్‌ప్లే బోర్డులు పనిచేయడం ఆగిపోతున్నాయని వెల్లడించింది. ఈ విషయమై కొందరు పైలట్లు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. ఈ మేరకు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తాజాగా ఓ నివేదికను సమర్పించింది. 2013 వరకూ విమానాల్లో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు వాడటంపై అమెరికాలో నిషేధం ఉండేది. అయితే ఆ తర్వాతికాలంలో దాన్ని తొలగించారు. ప్రస్తుతం విమానాల్లో సెల్‌ఫోన్లను ‘ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌’లో ఉంచి తీసుకెళ్లేందుకు ఎయిర్‌లైన్స్‌ అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. 
 
ముఖ్యంగా ఈ రెండు రకాలకు..
తాజాగా ఈ సెల్‌ఫోన్ల వైఫై సంకేతాలు, భూమిపై ఉండే రాడార్ల కారణంగా బోయింగ్‌ కంపెనీకి చెందిన 737, 777 క్లాస్‌ విమానాల్లోని కాప్‌పిట్‌ డిస్‌ప్లే యూనిట్‌లో సమస్య తలెత్తుతోంది. విమానం వెళుతున్న వేగం, ఎత్తు, వెళ్లాల్సిన దిశ తదితర అంశాలు ఈ డిస్‌ప్లే యూనిట్‌లో కనిపిస్తాయి. పైలట్లు సురక్షితంగా విమానాన్ని నడిపేందుకు ఈ వ్యవస్థ మార్గదర్శనం చేస్తుంది. కానీ సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల కారణంగా ఈ డిస్‌ప్లే యూనిట్లు పనిచేయకుండా పోతున్నాయని, తద్వారా విమాన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని ఎఫ్‌ఏఏ తెలిపింది. తాము గాల్లో ఉండగానే డిస్‌ప్లే యూనిట్లు మూగబోయినట్లు బోయింగ్‌ ఎన్‌జీ 737 పైలట్లు దాదాపు 12 సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది.  

తప్పు సరిచేస్తామన్న హనీవెల్‌ 
ప్రస్తుతం అమెరికాలో 1,300కుపైగా విమానాలు తిరుగుతుండగా, వీటిలో బోయింగ్‌ 737, 777 క్లాస్‌ విమానాలకు ఈ ముప్పుందని ఎఫ్‌ఏఏ చెప్పింది. ప్రముఖ ఏరోస్పేస్‌ కంపెనీ హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ ఈ డిస్‌ప్లే యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది. ఈ డిస్‌ప్లే యూనిట్లను 2019, నవంబర్‌లోగా మార్చాలని ఎఫ్‌ఏఏ ఆదేశించింది. కాగా, ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) నివేదికను హనీవెల్‌ సంస్థ ఖండించింది. సెల్‌ఫోన్లలోని సిగ్నల్స్, ఇతర రేడియో సంకేతాలు తమ డిస్‌ప్లే యూనిట్లను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. తాజాగా ఎఫ్‌ఏఏ ఆదేశాల నేపథ్యంలో బోయింగ్‌ విమానాల్లోని తమ డిస్‌ప్లే యూనిట్లను మారుస్తున్నామని హనీవెల్‌ సంస్థ తెలిపింది. ఈ విషయమై తమ ఇంజనీరింగ్‌ నిపుణులు దృష్టి సారిస్తారని కూడా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement